TS Assembly Elections 2023 : ప్లాన్ ప్రకారం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేయిస్తుండు - షబ్బీర్ అలీ
X
కామారెడ్డి బరి నుంచి తప్పుకుంటున్నారంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందించారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేశారు. తాను కామారెడ్డిని వదిలి ఎల్లారెడ్డి, నిజామాబాద్, జూబ్లీహిల్స్ నుంచి బరిలో దిగుతున్నానంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కనుసన్నల్లో ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ వర్గాలు ఈ దుష్ప్రచారం చేస్తున్నాయని షబ్బీర్ అలీ ఆరోపించారు. తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.
కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయనున్నారని తెలిసిన రోజే స్వాగతించానని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చన్న ఆయన.. తనకు కుట్రలు కుతంత్రాలు తెలియవని అన్నారు. ఇంతకాలం నిజాయితీగా రాజకీయాలు చేశానని ఇకపైనా అలాగే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో తలపడి కేసీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని షబ్బీర్ అలీ సవాల్ విసిరారు.
అధర్మానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు ఎప్పటికీ క్షమించరన్న షబ్బీర్ అలీ.. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ గజ్వేల్ నుంచి ఇక్కడికి వస్తున్నారని విమర్శించారు. తాను కామారెడ్డిలో ఉండనని, గజ్వేల్ ప్రజలే సమస్తమని కేసీఆర్ బహిరంగంగా చెప్పిన మాటల్ని గుర్తు చేసిన ఆయన.. దీనిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిని ఓ పావుగా వినియోగించుకుంటే అది మూర్ఖత్వమే అవుతుందన్న షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు. చైతన్యవంతులైన కామారెడ్డి ప్రజలతో పాచికలు ఆడాలనుకుంటే అది రాజకీయ సమాధి వైపు అడుగులు వేయడమేనని హెచ్చరించారు.