కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన మల్లిఖార్జున ఖర్గే
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలకు పదనుపెడుతోంది. ప్రచారంలో దూసుకుపోతున్న ఆ పార్టీ ప్రజల్ని ఆకట్టుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆరు హామీలను ప్రకటించిన కాంగ్రెస్.. వాటికి అనుబంధంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే గాంధీ భవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అభయ హస్తం పేరుతో రూపొందించిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో పాటు మరో 62 కీలక అంశాలను చేర్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.
మేనిఫెస్టో విడుదల అనంతరం మాట్లాడిన ఖర్గే అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ అక్షరాలా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టాలని ఓటర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్న ఖర్గే అందుకే ఆ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తగ్గించేశాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూసి కేసీఆర్కు ఓటమి తప్పదని అర్థమైందని అన్నారు.
ఆరు గ్యారంటీలు..
మహాలక్ష్మి: మహిళలకు ప్రతి నెల రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
రైతు భరోసా ప్రతి ఏటా: రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరిపంటకు క్వింటాలుకు రూ.500 బోనస్
గృహజ్యోతి: ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
ఇందిరమ్మ ఇళ్లు: ఇల్లులేని వారికి ఇంటి స్థలం-రూ.5లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం.
యువ వికాసం: విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్.
చేయూత: రూ.4వేల నెలవారీ పింఛను, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా