Revanth Reddy : అధిష్టానంపైనే ఒత్తిడి.. రాత్రికి రాత్రే అంతా మార్పు
X
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఐదుగురు అభ్యర్థులతో తుది జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. పటాన్ చెరులో అభ్యర్థిని మార్చింది. ఇంతకుముందు నీలం మధును కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించగా.. ఆయన స్థానంలో కాటా శ్రీనివాస్ గౌడ్కు టికెట్ ఇచ్చింది. తుంగతుర్తి నుంచి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్ను నిరాశే ఎదురైంది. తుంగతుర్తి టికెట్ను మందుల శామ్యూల్కు ఇచ్చింది. సూర్యపేట్ నుంచి టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి కూడా మొండి చెయి చూపింది. ఆ టికెట్ను సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కేటాయించింది. కాగా టికెట్ల కేటాయింపు విషయంలో దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పంతం నెగ్గించుకున్నారు. కాంగ్రెస్ అధిష్టనంపై వారి ఒత్తిడి పనిచేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దన్నుతోనే రాంరెడ్డి దామోదర్ రెడ్డికి, రాజనరసింహ పట్టుతోనే శ్రీనివాస్ గౌడ్ లకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం.
పార్టీ పటాన్ చెరు టికెట్ ను మొదట కాటా శ్రీనివాస్ గౌడ్ ను కాదని నీలం మధుకు ప్రకటించించి. దీంతో శ్రీనివాస్ గౌడ్ అనుచరులు తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన రాజనరసింహ శ్రీనివాస్ గౌడ్ ను వెంట తీసుకుని మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్లారు. ఫలితంగా.. రాత్రికి రాత్రే అంతా మారిపోయి నీలం మధు స్థానంలో శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయించారు. సూర్యపేటలో 2018లో కూడా ఇదే జరిగింది. చివరి క్షణ వరకు టికెట్ ను సస్పెన్స్ లో పెట్టి.. చివరికి రిలీజ్ చేశారు. అప్పుడు కూడా దామోదర్ రెడ్డి, రమేశ్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడ్డారు. కాగా, ఈసారి కూడా అదే తీరులో పోటీ ఎదురయింది. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పాదయాత్రలు చేశానని సీనియర్ నేత దామోదర్ రెడ్డి, పోయినసారే టికెట్ త్యాగం చేశానని రమేశ్ రెడ్డి తీవ్రంగా పోటీపడ్డారు. ఈ క్రమంలో దామోదర్ రెడ్డికి ఉత్తమ్, రమేశ్ రెడ్డికి రేవంత్ రెడ్డి మద్దతిచ్చారు. దీంతో చివరి వరకు టికెట్ ను సస్పెన్స్ లో పెట్టగా.. ఉత్తమ్ ఒత్తిడితో దామోదర్ రెడ్డికే టికెట్ దక్కింది.