Home > తెలంగాణ > Telangana Elections 2023 > రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం.. సమరానికి సై!!!

రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం.. సమరానికి సై!!!

రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం.. సమరానికి సై!!!
X



Thumb: 50 రోజులే గడువు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నిక‌ల‌కు స‌రిగ్గా 50 రోజుల గ‌డువు మాత్ర‌మే వుంది. న‌వంబ‌ర్ 30న రాష్ట్ర‌మంతా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ విడుద‌ల కావ‌డంతో నిన్నటి నుంచే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ప్రధాన పార్టీలోని ఇక పూర్తి స్థాయిలో కదనరంగంలోకి దూకనున్నాయి. గత నెల రోజుల నుంచే.. అక్టోబర్ మొదటి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావొచ్చని అంతా ఊహించారు. అనుకున్నట్టుగానే ఎన్నికల సంఘం సోమవారం(అక్టోబర్ 8 న) షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లే గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న ప్రధాన పార్టీలన్ని ప్రచారాలకు సిద్ధమయ్యాయి. ఇంకా 50 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ఆయా పార్టీల నాయకులు సిద్ధమవుతుండగా, ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార, పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

ఇప్పటికే కేవలం ఆరు నియోజకవర్గాలకు తప్ప మిగతా 113 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలో యమ స్పీడ్ గా ఉంది. బహిరంగసభలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పథకాలు.. అంటూ పార్టీలోని కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావులు రాష్ట్రంలోని అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ పక్కా అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా... ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ప్రజలకు తమపై నమ్మకం పెరిగిందని, ఓటర్లు ఆశీర్వదిస్తారని చెబుతోంది. కానీ కొన్ని రోజులుగా అభ్యర్థుల విషయంలో నానా తంటాలు పడుతున్న టీకాంగ్రెస్.. ఇప్పటికీ ఏయే అభ్యర్థులను బరిలోకి దించాలన్న విషయంపై ఓ నిర్ణయానికి కొలిక్కి రాలేదు.

ఇక పసుపు బోర్డు అంటూ తెలంగాణ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసిన బీజేపీ కూడా పక్కా వ్యూహంతో ప్రచారానికి రెడీ అయింది. ఇప్పటికే పార్టీ అగ్రనేత, ప్రధాని మోదీ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లలో బహిరంగసభలు నిర్వహించారు. హోంమంత్రి అమిత్‌షా సైతం ఈరోజు(మంగళవారం) ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలోనూ, హైదరాబాద్‌లో మేధావులతో జరిగే సమావేశంలోనూ పాల్గొంటారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అనేక పథకాలు ప్రారంభించిందని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఈ 50 రోజుల్లోనే బతుకమ్మ పండుగతో పాటు దసరా, దీపావళి పండుగలు సైతం రావడంతో నాయకులకు ఖర్చు అమాత్రం పెరగడం పక్కాగా కనిపిస్తోంది. ఇప్పటికే రాజకీయ నాయకులు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లగా, ఇక ప్రచారాలు ఊపందుకుంటే ఓటర్లు సైతం అదే మూడ్‌లోకి వెళ్లనున్నారు.




Updated : 10 Oct 2023 7:19 AM IST
Tags:    
Next Story
Share it
Top