Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. అధికారులతో సీఎస్ సమీక్ష
X
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో ఉదయం 10.28 గంటలకు గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ క్రమంలో అధికారులతో సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. సీఎం ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను సీఎస్ ఆదేశించారు. ఎల్బీ స్టేడియం దగ్గరకు వెళ్లే రోడ్ల మరమ్మతులు చేపట్టాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. నిన్న హైకమాండ్ పిలుపుతో హుటాహుటిన ఆయన ఢిల్లీ వెళ్లారు. కేబినెట్లో ఎవరిని తీసుకోవాలి.. ఎవరికి ఏ పదవి కేటాయించాలనే దానిపై రేవంత్ రెడ్డితో చర్చించనున్నారు. అన్నీ కుదిరితే రేపటిలోగా మంత్రివర్గాన్ని సైతం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు తన ప్రమాణస్వీకారానికి రావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రేవంత్ ఆహ్వానించారు.