Bhatti Vikramarka : 6 Guarantees:100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం
X
తెలంగాణ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి, తొలి విడత అసెంబ్లీ సమావేశాలను సైతం పూర్తి చేసుకుని ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టిన ముగ్గురు మంత్రులకు కార్యకర్తలు జిల్లా సరిహద్దుల్లో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, సమాచార, గృహ నిర్మాణ శాఖామంత్రి గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ శ్వీకారం చేసిన విషయం విదితమే. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాకు మూడు మంత్రి పదవులను మోసుకొస్తున్న ముగ్గురు మొనగాళ్లకు ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దుల్లోని నాయకన్ గూడెం వద్దకు భారీగా తరలి వెళ్లిన కార్యకర్తలు ముగ్గురు నేతలకు సాదర స్వాగతం పలికారు. నేతలపైన పూల వర్షం కురిపిస్తూ భారీ గజ మాలని ధరింపజేశారు.
అనంతరం ప్రచార రథంపై ముగ్గురు మంత్రులు స్వాగతం తెలుపుతూ జనాలను ఉత్తేజపరిచారు. ఆ తర్వాత కూసుమంచి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాల నందు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పోస్టర్ ను ఆవిష్కరించారు. అక్కడి నుంచి జీళ్లచెరువు మీదుగా భారీ ర్యాలీగా ఖమ్మం చేరుకొని, అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ముందుగా జిల్లాలో 9 సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. వచ్చే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. గ్యారంటీలకు వారంటీ లేదన్న వారికి సమాధానమిచ్చామని చెప్పారు. తమది ప్రజా ప్రభుత్వమని చెప్పారు.