KCR : ‘తీవ్రంగా పరిగణిస్తాం’.. సీఎం కేసీఆర్కు ఈసీ నోటీసులు
X
ఎన్నికల ముంగిట కేసీఆర్ ప్రభుత్వానికి భారీ ఊరటనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతుబంధుకు అడ్డంకులు తొలగాయి. నిధులు జమ చేసేందుకు ఈ నెల 28 వరకే ఈసీ అనుమతిచ్చింది. దీంతో వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు మరో ఐదు రోజులే ఉన్న సమయంలో ఈసీ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా ఈ క్రమంలో ఈసీ మరో నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేస్తూ.. లేఖ రాసింది.
బాధ్యతాయుతమైన పదవి, పార్టీ స్టార్ క్యాంపెయిననర్ గా ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయొద్దని, అలా చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని సూచించింది. ఇలాంటి ప్రసంగాలు చేయడం ఈసీ రూల్స్ కు విరుద్ధమని, అలా మాట్లాడిన వ్యక్తుల పార్టీ అనుమతులు రద్దు చేసే అధికారం ఈసీకి ఉందని లేఖ ద్వారా హెచ్చరించింది. ప్రస్తుతం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని, మరోసారి అలా చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది. అక్టోబర్ 30న బాన్సువాడ సభలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన కత్తి దాడిని ఖండిస్తూ.. కేసీఆర్ పరుషపదాలతో రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఈ విషయాన్ని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు ఆదేశించిన ఈసీ.. ఈనెల 14న స్థానిక రిటర్నింగ్ అధికారికి నివేదిక పంపించారు. దీంతో ఇకమీదట రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని కేసీఆర్ కు ఈసీ అడ్వైజరీ జారీ చేసింది.