అమల్లోకి ఎన్నికల కోడ్.. ఖమ్మంలో భారీగా నగదు పట్టివేత
X
తెలంగాణ సహా మరో 4 రాష్ట్రాల్లో ఎన్నికల సందడి మొదలైంది. అయితే నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో అన్ని జిల్లాలో ఎన్నికల కోడ్, నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే ఎన్నికల కోడ్ అలా అమల్లోకి వచ్చిందో లేదో... పలు చోట్ల తనిఖీలు ప్రారంభం కాగా... ఖమ్మం జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. జిల్లాలోని వైరాలో అక్రమంగా తరలిస్తున్న రూ. 5 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో విస్తృత తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో వైరాలో తనిఖీలు చేస్తుండగా.. ఓ కారులో రూ.5 లక్షలు పట్టుకున్నారు. ఈ నగదును ఎవరు? ఎక్కడికి తరలిస్తున్నారు? అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడం, అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆ డబ్బును సీజ్ చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో... ఇకపై జిల్లా కలెక్టర్లతో పాటు నోడల్ అధికారులు కీలకంగా వ్యవహరిస్తారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. పథకాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. గతంలో ప్రారంభించిన వాటి విషయంలో కూడా ఫిర్యాదులు అందితే.. ఎన్నికల అధికారులు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రభుత్వం తరపున జరిగే కార్యక్రమాలు ఎన్నికల కోడ్ కు లోబడి మాత్రమే ఉండాలి. ప్రజాప్రతినిధులు కూడా ఎన్నికల కోడ్ కు లోబడి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే…. చర్యలు తీసుకుంటుంది ఈసీ. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 3 వరకు కూడా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటుంది.