Election commission : తెలంగాణ ఎన్నికలు.. కర్నాటక ప్రభుత్వానికి ఈసీ షాక్..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటక ప్రభుత్వం అడ్డదారిలో జోక్యం చేసుకుంటోందని ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతి లేకుండా కర్నాటక ప్రభుత్వం తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని, దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది. ఈమేరకు మంగళవారం సాయంత్రంలోపు తమకు వివరణ ఇవ్వాలని కర్నాటక ప్రభుత్వ కార్యదర్శిని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్నాకటలో కాంగ్రెస్ ప్రభుత్వం తన విజయాలపై తెలంగాణ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇచ్చింది. తమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పింది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే ఆ పార్టీ తెలంగాణలోనూ ఇవ్వడం తెలిసిందే. ఇది ఎన్నికల దొడ్డిదారిన ప్రభావితం చేయడమేనని బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతోపాటు ఆయా శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. సిద్ధరామయ్య ప్రభుత్వం పక్క రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తోందని మండిపడింది. వివరాలు తెలుసున్న ఈసీ అధికారులు కర్నాటక సర్కారుకు మొట్టికాయలు వేశారు.