ఈసీ కీలక భేటీ.. రేపు 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్..?
X
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం జోరు పెంచింది. ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించిన నివేదిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ఎలక్షన్ అబ్జర్వర్లతో ఈసీ కీలక భేటీకి సిద్ధమైంది. ఎలక్షన్ షెడ్యూల్ ఖరారుచేసేందుకు అక్టోబర్ 6న ఢిల్లీలో సమావేశం కానుంది. సమావేశం ముగిసిన అనంతరం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు, క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణపై అంగ, అర్థ బలాల ప్రభావాన్ని తగ్గించేందుకు అవసరమైన వ్యూహాన్ని అమలుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన పరిశీలకులతో శుక్రవారం మాట్లాడనుంది. అనంతరం షెడ్యూల్ ఖరారు చేసే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఇప్పటికే సమీక్షలు నిర్వహించింది. ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు అవసరమైన సూచనలు చేసింది.
మిజోరం అసెంబ్లీకి గడువు ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగియనుంది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల అసెంబ్లీల కాలపరిమితి వచ్చే ఏడాది జనవరి వరకు ఉంది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో నవంబర్-డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై వరుస సమీక్షలు ముగిసిన నేపథ్యంలో.. ఈసీ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్సుంది.