Election Commission : జూన్ 8లోపు ఖమ్మం-వరంగల్-నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
X
ఉమ్మడి నల్లగొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ సన్నాహకాలు ప్రారంభించింది. జూన్ 8లోపు ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. జనగాం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ ఖాళీని 2024 జూన్ 8 కల్లా భర్తీ చేయాలని ఈసీ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసుకోడానికి షెడ్యూలు ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఈసీ రూపొందించిన షెడ్యూలు ప్రకారం పట్టభద్రుల కేటగిరీలో కొత్త ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకోడానికి ఈ ఏడాది నవంబరు 1వ తేదీని కటాఫ్ డేట్‌గా నిర్ణయించింది.
నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తై మూడేండ్లు నిండినవారు ఓటు వేసేందుకు అర్హులని ఈసీ స్పష్టం చేసింది. ఉప ఎన్నికకు సంబంధించి శనివారం పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని, జనవరి 15న పత్రికల్లో ఒకసారి, 25న మరోసారి ఎన్నికల నిబంధనలపై పత్రిక ప్రకటన ఇవ్వాలని ఆదేశించింది. ఫాం-18 దరఖాస్తులు స్వీకరించేందుకు ఫిబ్రవరి 6ను చివరి తేదీగా ప్రకటించింది. ఫిబ్రవరి 21న తాత్కాలిక ఎన్నికల ముసాయిదాను తయారు చేసుకోవాలని, 24 నుంచి మార్చి 14వ అభ్యంతరాలను స్వీకరించటం, ఏప్రిల్ 4 నాటికి సవరణలో కూడిన తుది ఎన్నికల ముసాయిదాను ప్రచురించాలని స్పష్టం చేసింది.
కీలకమైన తేదీలు ఇవే..
కొత్తగా ఓటర్లుగా (గ్రాడ్యుయేట్స్) నమోదుచేసుకునేందుకు నోటిఫికేషన్ : డిసెంబరు 30, 2023
ఫాం-18 సమర్పించేందుకు తుది గడువు : ఫిబ్రవరి 6, 2024
ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ : ఫిబ్రవరి 21, 2024
డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్ : ఫిబ్రవరి 24, 2024
అభ్యంతరాలరం గడువు : మార్చి 13, 2024
పరిష్కరించడానికి డెడ్‌లైన్ : మార్చి 29, 2024
తుది ఓటర్ల జాబితా విడుదల : ఏప్రిల్ 4, 2024