Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : కాంగ్రెస్ వస్తే కరెంటు పోవుడు ఖాయం.. రైతు బంధుకు రాంరాం - కేసీఆర్

KCR : కాంగ్రెస్ వస్తే కరెంటు పోవుడు ఖాయం.. రైతు బంధుకు రాంరాం - కేసీఆర్

KCR : కాంగ్రెస్ వస్తే కరెంటు పోవుడు ఖాయం.. రైతు బంధుకు రాంరాం - కేసీఆర్
X

రైతులు బాగుపడాలని, వ్యవసాయ స్థిరీకరణ జరగాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అందుకే వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు సాగునీళ్లపై పన్నులు రద్దు చేశామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నీటి పన్ను ముక్కు పిండి వసూలు చేసిందని విమర్శించారు. ప్రస్తుతం వ్యవసాయానికి సాగు నీళ్లు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటు రైతు బంధుతో అన్నదాతలను ఆదుకుంటున్నామని, పండించిన ధాన్యాన్ని కొంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.

భూములపై హక్కు రైతులకే ఉండాలన్న ఉద్దేశంతో ధరణి పోర్టల్ తెచ్చామని బీఆర్ఎస్ అధినేత చెప్పారు. అలాంటి ధరణి పోర్టల్ను కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో కలిపేస్తామని అంటున్నారని మండిపడ్డారు. రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొనుగోలు సొమ్ము ధరణి పోర్టల్ సాయంతోనే రైతుల ఖాతాల్లో వేస్తున్నామని గుర్తు చేశారు. ఒకవేళ దాన్ని తీసేస్తే దళారీల రాజ్యం మళ్లీ వస్తుందని కేసీఆర్ స్పష్టంచేశారు. ప్రజలు కడుతున్న పన్నులను రైతు బంధు పేరుతో దుబారా చేస్తున్నారని మరో కాంగ్రెస్ నేత అంటున్నారని మండిపడ్డారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతు బంధు సాయాన్ని రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదని కేవలం 3 గంటలు చాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేసీఆర్ విమర్శించారు. 10 హార్స్ పవర్ మోటర్లు వాడితే 3 గంటల్లోనే నీళ్లు పారుతాయని టీపీసీసీ చీఫ్ అంటున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు రైతులందరికీ 10 హార్స్ పవర్ మోటర్లు కాంగ్రెసోళ్లు కొనిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం ఇస్తున్న రూ.2వేల పింఛనును రూ.5వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ అమలు చేస్తామన్న కేసీఆర్.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.


Updated : 14 Nov 2023 4:32 PM IST
Tags:    
Next Story
Share it
Top