Home > తెలంగాణ > Telangana Elections 2023 > Revanth Reddy : కాంగ్రెస్ గెలుపుకు 5 ప్రధాన కారణాలు.. కొత్త ఆశలతో..

Revanth Reddy : కాంగ్రెస్ గెలుపుకు 5 ప్రధాన కారణాలు.. కొత్త ఆశలతో..

Revanth Reddy : కాంగ్రెస్ గెలుపుకు 5 ప్రధాన కారణాలు.. కొత్త ఆశలతో..
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్తోంది. మేజిక్ ఫిగర్ దాటి సొంత బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఒక దశలో ఉనికే లేదన్నట్టు కనిపించిన మూడు రంగుల పార్టీ ఇంతటి ఘన విజయాన్ని ఎలా సాధించింది? తెలంగాణను, తెలంగాణ సెంటిమెంట్‌ను తన గుత్తసొత్తని భావించుకునే బీఆర్ఎస్‌ను ఎలా ఓడించింది? కీచులాటలకు, ఢిల్లీ హైకమాండ్ పట్ల జోహకుంకు మారుపేరుపైన కాంగ్రెస్‌ తను కూడా ఊహించన మెజారిటీతో గద్దెపైకి ఎలా దూసుకెళ్లింది? ఈ ప్ర్రశ్నలకు సమాధానంగా ఐదు కారణాలను చెప్పుకోవచ్చు..

1. మార్పు కోరిన జనం..

తెలంగాణ ప్రజలు పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఇక చాలనుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్ మినహా స్థూలంగా ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. రైతుబంధు, దళితబంధు వంటి పథకాలు పనిచేయలేదు. ప్రభుత్వ పథకాలు కేవలం కొద్దిమందికే పరిమితం కావడంతో లబ్ధి పొందని వర్గాలు వ్యతిరేకంగా ఓటేశాయి. ఉద్యోగ నియామాకాలు లేకపోవడం, కొంతమంది బీఆర్ఎస్ నేతల అహంకారం, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వంటి కారణాలు గులాబీ జెండాను ఇంటికి పంపాయి. బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపాయన్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లడం కూడా ప్రభావం చూపింది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గులాబీ పార్టీ తీరు నచ్చలేదు. ఇవన్నీ కాంగ్రెస్‌కు సానుకూలంగా మారాయి. సంక్షేమ పథకాలను ఏ ప్రభుత్వమైనా అమలు చేస్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కూడా ఒక అవకాశం ఇస్తే బావుటుందని భావించారు. కొత్త ఆశలతో షేక్‘హ్యాండ్’ చేశారు.

2. మారిన కాంగ్రెస్

అంతర్గత ప్రజాస్వామ్యానికి పెట్టింది పేరైన కాంగ్రెస్ ఎన్నికల ముందు కీచులాటకు స్వస్తి పలికింది. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నీ తానై నేతలను సమన్వయం చేసుకుని ప్రచారాన్ని జోరుగా సాగించారు. సీనియర్ నేతలకు ఆయనపై అక్కసు ఉన్నా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతవరకు తమకు భవిష్యత్ ఉండదనే భయంతో మౌనంగా పనిచేసుకుపోయారు. పార్టీ టికెట్ల విషయంలో పార్టీ వ్యూహాత్మకంగా చేసిన మార్పు చేర్పులు విజయానికి దోహదపడ్డాయి. గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వడం, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్రచార వ్యూహాలు పార్టీకి కలిసొచ్చాయి. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర కూడా ప్రభావం చూపింది. పొరుగు రాష్ట్రమైన కర్నాటలో ఇటీవల కాంగ్రెస్ సాధించిన విజయం కూడా తెలంగాణ కాంగ్రెస్‌కు జోష్ ఇచ్చింది. కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎంలు అండగా నిలచి మరీ పోరాడారు.

3. రేవంత్ రెడ్డి సారథ్యం

ఒక్కొక్కరిదీ ఒక్కోదారి అన్నట్లుండే పార్టీ నేతను రేవంత్ రెడ్డి ఏకతాటిపై నడిపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల ఆశీస్సులు పుష్కలంగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్పిందే శాసనమైంది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను రేవంత్ బలంగా ఎండగడుతూ పాదయాత్ర సహా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అరెస్టులకు, బెదిరింపులు, దూషణలకు భయపడకుండా తన పని తాను చేసుకుపోయారు. ప్రతి విమర్శల్లో చాలా వరకు హుందాగానే వ్యవహరించారు. చివరకు తనను ‘పొట్టోడు’ అని తిట్టిన వాళ్లను కూడా హుందా విమర్శలతోనే గట్టిగాన ఎదుర్కొన్నారు. రాష్ట్రమంతటా కాలికి బలపం కట్టుకుని తిరిగి ప్రచారం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి ప్రత్యర్థి పార్టీ అసంతృప్త నేతలను స్వయంగా ఆహ్వానించి మువ్వన్నెల జెండా కప్పి పార్టీని బలోపేతం చేశారు.

4. కాంగ్రెస్ హామీలు

కాంగ్రెస్ విజయానికి పార్టీ ఇచ్చిన ‘ఆరు గ్యారంటీలు’ కూడా దోహదపడ్డాయి. కర్నాటక ఎన్నికల్లో పార్టీని గెలిపించిన హామీలతోపాటు రైతులకు పంట పెట్టుబడి సాయం పెంపు, రైతుకూలీలకు కూడా ఆర్థిక సాయం, మహిళలకు పెన్షన్లు, నిరుద్యోగులు నియామకాలు వంటి హామీలను ప్రజలు విశ్వసించారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందని ప్రజలను ఆకట్టుకునే హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికీ చేదోడు వాదోడుగా ఉంటుందన్న సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్లింది.

5. ప్రచారంలో కొత్తపుంతలు

కాంగ్రెస్ ప్రచారం ఈ ఎన్నికల్లో కొత్త పుంతలు తొక్కింది. పత్రికలు, టీవీ చానళ్లు వంటి సంప్రదాయ మీడియాతోపాటు సోషల్ మీడియాలో చేయి పార్టీ వినూత్న రీతిలో ప్రచారం చేసింది. వీడియోలు, పత్రికా ప్రకటనలు, ఊరేగింపులతో కేడర్‌లో ఉత్సాహం నింపింది. ప్రతికూల పరిస్థితిలో సైతం రాష్ట్ర మంతటా భారీ సభలు, సమావేశాలు నిర్వహించింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. 2014, 2018 ఎన్నికలకు భిన్నంగా, నేటి రాజకీయ ట్రెండ్‌కు అనుకూలంగా సాగిన కాంగ్రెస్ ప్రచారం ఆ పార్టీని అధికారానికి చేరువ చేసింది.




Updated : 3 Dec 2023 11:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top