KCR : ప్లీజ్ ఆసుపత్రికి రావొద్దు.. మాజీ సీఎం కేసీఆర్ రిక్వెస్ట్
X
తుంటి ఆపరేషన్ తో యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దయచేసి ఆసుపత్రికి ఎవరూ రావొద్దంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తనను పరామర్శించేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు యశోదా ఆసుపత్రికి తరలి వస్తున్నారని, వాళ్లందరికీ కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ పరామర్శల వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని కేసీఆర్ తెలిపారు. అదేవిధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర పేషెంట్లకు కూడా ఇబ్బందిగా మారుతోందని అన్నారు. తాను బాగానే ఉన్నానని, పది రోజుల్లో పూర్తి ఆరోగ్యంతో మళ్లీ ప్రజా జీవితంలోకి వస్తానని అన్నారు. అప్పటిదాక పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ కూడా యశోదా ఆసుపత్రికి రావొద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను కేటీఆర్ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తెలియజేస్తారని అన్నారు. కాగా 5 రోజుల కిందట కేసీఆర్ బాత్రూమ్ లో జారిపడగా తుంటి ఎముక విరిగింది. దీంతో ఈ నెల 9న ఆయనకు తుంటి ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.