Home > తెలంగాణ > Telangana Elections 2023 > KCR : అధికార నివాసం ఖాళీ చేయనున్న మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు

KCR : అధికార నివాసం ఖాళీ చేయనున్న మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు

KCR : అధికార నివాసం ఖాళీ చేయనున్న మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు
X

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసాన్ని ఇక్కడి సిబ్బంది ఖాళీ చేస్తున్నారు. దాదాపు 20 ఏండ్ల పాటు అధికారిక నివాసంగా కొనసాగిన తుగ్లక్‌ రోడ్‌లోని ఆ ఇంటితో ఆయనకు ఇక అనుబంధం తెగిపోయినట్లే. 2004లో అప్పటి కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ కు ఈ బంగ్లాను కేటాయించింది. ఆ ఏడాదిలో బీఆర్ఎస్(అప్పటి TRS)తరఫున కరీంనగర్‌ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్‌.. మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్‌ రోడ్‌లోని టైప్‌ 8 క్వార్టర్‌ను ప్రభుత్వం కేటాయించింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఉపఎన్నికలో మళ్లీ ఎంపీగా నెగ్గి అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికై అదే క్వార్టర్‌లో ఉన్నారు

ఇక 2014లో కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం దిల్లీలో అధికారిక నివాసాలు కేటాయిస్తుంది. ఇందులో భాగంగా అదే నివాసాన్ని కేసీఆర్‌కు కేటాయించింది. అదే సమయంలో నిజామాబాద్‌ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్‌ కుమార్తె కవిత సైతం ఆ నివాసాన్నే తన అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. అలా ఆ క్వార్టర్‌ ముఖ్యమంత్రికి, ఎంపీ కవితకు.. అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్‌ రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక అదే నివాసాన్ని కొనసాగించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. అధికారం కోల్పోయిన ఏ ప్రజా ప్రతినిధి అయినా.. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి నెల రోజుల సమయం ఉంటుంది. కానీ.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆ ఇంటిని రెండు మూడు రోజుల్లోనే పూర్తిగా ఖాళీ చేయనున్నారు. సీఎం హోదాలో హస్తినకు ఎప్పుడు వచ్చినా కేసీఆర్ ఇదే ఇంట్లో ఆయన బస చేసేవారు. ఇప్పుడిక ఆ ఇల్లు ఖాళీ అయితే రెండు దశాబ్దాలుగా ఆయనకు ఈ ఇంటితో ఉన్న బంధం తెగిపోనుంది.




Updated : 5 Dec 2023 1:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top