Vivek Venkataswamy : తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి వివేక్
X
తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో సీనియర్ నేత అయిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి గుడ్ బై చెప్పి.. నేడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. వివేక్ కాంగ్రెస్‌లో చేరతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలుత ఈ ప్రచారాన్ని ఆయన ఖండించినప్పటికి... బీజేపీ అగ్రనేతల సభలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాగా ఆ సస్పెన్స్ కు ఈ రోజు తెరపడిందిద. తాజాగా వివేక్ వెంకటస్వామితో పాటు ఆయన కుమారుడు వంశీ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కిషన్ రెడ్డి తమ రాజీనామా లేఖను అందించారు.
ఇదిలా ఉండగా ఈ రోజు వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సమాచారం. హైదరాబాద్ లోని నోవాటెల్ లో రాహుల్ తో భేటి కానున్నారని తెలిసింది. అయితే వివేక్ పార్టీలో చేరితే ఆయన తనయుడు వంశీకి చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వివేక్‌కు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇక, గతంలో చెన్నూరు నియోజకవర్గం నుంచి వివేక్ సోదరుడు వినోద్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వినోద్ కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఈసారి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ.. వినోద్‌కు బెల్లంపల్లి టికెట్ ఇచ్చింది.