TS Assembly Elections 2023 : వరంగల్ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అసంతృప్తులు, ఆశావహులు కండువాలు మార్చుతున్నారు. తమకు అనుకూలంగా ఉండి పదవులిచ్చే పార్టీలకు జై కొడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. సర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.. ఇవాళ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నర్సంపేట ఎమ్మెల్యే టికెట్ ను ఇప్పటికే దొంతి మాధవరెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే. రేవూరి ప్రకాష్ చేరికతో.. పరకాల నియోజక వర్గ టికెట్ ను ఆయనకు కేటాయించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధం అయినట్లుగా తెలుస్తుంది. రేవూరి ప్రకాష్ రెడ్డి 1994,1999,2009 సంవత్సరాల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2018లో టీడీపీ తరుపున పశ్చిమ వరంగల్ నుంచి పోటీ చేసి దాస్యం వినయ్ భాస్కర్ చేతిలో ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. అయితే ప్రకాష్ రెడ్డి గత కొన్ని రోజులుగా బీజేపీకి అంటీ అంటనట్టుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల రేవంత్ రెడ్డి, మల్లు రవితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ప్రకాష్ రెడ్డిన కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం ప్రకాష్ రెడ్డి చేరిక పరకాల కాంగ్రెస్ లో చర్చకు దారితీసింది. ఇప్పటికే అక్కడి నేతలు కొండా సురేఖ, ఇనుగాల వెంకట్రామిరెడ్డి పరకాల నియోజక వర్గ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాష్ రెడ్డికి టికెట్ కేటాయించే అంశం బయటికిరావడంతో చర్చలు నడుస్తున్నాయి.