TS Assembly Elections 2023 : 'కేసీఆర్ గెలిస్తే గుంట భూమి మిగలదు'.. రైతులకు కేఏ పాల్ వార్నింగ్
X
సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలకి చెందిన సీనియర్ నేతలంతా సిద్ధమైన తరుణంలో.. ఆ రేసులో తాను సైతం ఉన్నానంటున్నారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్. కామారెడ్డి నియోజకవర్గంలోని రైతులు కోరుకుంటే తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. గురువారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులను కలిశారు కేఏ పాల్. భవిష్యత్తు కార్యచరణపై రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డిలో పోటీ చేయబోతున్న కేసీఆర్ పై విమర్శలు సంధించారు. రెండు వేల ఎకరాల భూమిని కబ్జా చేయడానికే కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గెలిస్తే గుంట భూమి మిగలదని రైతులను హెచ్చరించారు. అందుకే కేసీఆర్‌ను ఇక్కడ ఓడించాలని కోరారు.
72 గంటలలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల సత్తా చూపిస్తారంటూ హెచ్చరించారు.కేసీఆర్ ను ఓడించి కామారెడ్డి చరిత్రలో నిలవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై రైతు ప్రతినిధిని పోటీకి నిలపాలని కోరారు. తాను రైతుల కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కేఏ పాల్ అన్నారు. ఒక వేళ కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తే ఉచిత వైద్యం, విద్య, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే హామీ నాదీ అని కేఏ పాల్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలూ ఒక్కటే అని కేఏ పాల్ ఆరోపించారు. ఇందులో ఏ పార్టీకి ఓటు వేసినా అది కేసీఆర్‌కు ఓటు వేసినట్టే అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఈ ఎన్నికల్లో గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.