Telangana assembly elections 2023: కుదిరిన కొత్త పొత్తులు.. సీఎం సీటు తెచ్చేనా..?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది.. ఏ పార్టీకి డిపాజిట్లు కూడా రావు.. ఏ పార్టీకి ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది అనేది తెలియడం లేదు. వాటికి తోడు ఈసారి పొత్తులు కూడా పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ తో సీపీఐ పార్టీ పొత్తుపెట్టుకుంటే.. పోటీ నుంచి తప్పుకున్న వైఎస్ఆర్టీపీ, టీజేఎస్ కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాయి. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే.. సీపీఎం మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ కు ఇది తొలి ఎన్నిక కాగా.. గులాబీతో ఎంఐఎం ఫ్రెండ్లీ పొత్తు పెట్టుకుని బరిలోకి దిగుతున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల పోటీ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. కర్నాటకలో గెలిచిన కాంగ్రెస్ ఈసారి వినూత్నంగా అడుగులు వేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తమ పార్టీని గెలిపించాలంటూ.. ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ ను గెలిపించి హ్యాట్రిక్ సీఎం చేయాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. గత రెండేళ్లుగా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ.. బీసీ సీఎం, బీసీ నినాదంతో బరిలోకి దిగుతుంది.
బీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా 119 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు కేటాయించింది. సీఎం కేసీఆర్ సిట్టింగ్ స్థానం గజ్వేలే కాకుండా ఈసారి కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు. ఖానాపూర్, కోరుట్ల, ములుగు, అంపూర్, మలక్ పేట్, కార్వాన్, చార్మినార్ స్థానాల్లో కొత్త అభ్యర్థులకు చాన్స్ ఇచ్చింది బీఆర్ఎస్. ఉప్పల్, బోథల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఓడిన అభ్యర్థులకు మళ్లీ చాన్స్ ఇచ్చింది. 118 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపి, 1 స్థానాన్ని సీపీఐతో పొత్తుకు కేటాయించింది. వీళ్లలో 3 ఎంపీలు, ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. 30 టికెట్లను ఇతర పార్టీ నుంచి వచ్చినవారికి పంచింది.
గతంలో పోటీచేసి ఓడిన 48 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి రెండు స్థానాలు.. కామారెడ్డి, కొడంగల్ లో బరిలోకి దిగుతున్నారు. పాత, కొత్త నాయకులతో కలిపి బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తుంది. 8 టికెట్లను జనసేనకు కేటాయించింది. కాగా ఇతర పార్టీ నుంచి బీజేపీలో చేరిన 20 మందికి టికెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన 22 మందికి కూడా ఈసారి అవకాశం కల్పించారు. మిగతా స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించారు. ఇన్ని వ్యూహాలు, ఇన్ని సమీకరణాల మధ్య ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.