KCR : మేజారిటీపై కన్నేసిన కేసీఆర్.. కామారెడ్డి, గజ్వేల్లో కొత్త తలనొప్పి
X
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది. సిట్టింగ్, కొంతమంది కొత్త అభ్యర్థులను ఈసారి టికెట్లు కేటాయించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అదే కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా మారింది. కేసీఆర్ బరిలోకి దిగుతున్న నియోజకవర్గాల్లో చాలామంది అభ్యర్థులు ఆయనకు పోటీగా నిలబడ్డారు. మంగళవారం కొంతమంది నామినేషన్ విత్ డ్రా చేసుకున్నా.. ఇంకా గజ్వేల్ లో 86 మంది, కామారెడ్డిలో 58 మంది పోటీలోనే ఉన్నారు. వారిలో మెజారిటీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించాలని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ప్రయత్నాలు చేసినా ఎవరూ వినడం లేదు. ఫోన్ చేసి మాట్లాడినా పోటీలో ఉండి తీరతామని స్పష్టం చేస్తున్నారు. కాగా బరిలో దిగిన వారిలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బాధితులుగా మిగిలిపోయిన అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు.
కామారెడ్డిలో నిలబడ్డ అభ్యర్థులను తప్పించేందుకు హరీశ్ రావు, కేటీఆర్ లకు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. వారిని బరిలోనుంచి తప్పుకోమని ఆఫర్స్ ఇస్తున్నట్లు సమాచారం. నష్టపోయిన సాధారణ వ్యక్తులు.. నిరసనగా కేసీఆర్ మీద పోటీ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు. వాళ్లలో గజ్వేల్ లోని మల్లన్న సాగర్ ముంపు బాధితులు, నిరుద్యోగులు నామినేషన్లు వేశారు. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ తో భూములు కోల్పోయిన రైతులు, అమరవీరుల కుటుంబాల నుంచి పోటీకి దిగుతున్నారు. కాగా వీళ్లంతా పోటీ చేస్తే కేటీఆర్ కు ఆ స్థానాల్లో మెజారిటీ తగ్గుతుందని భయం పట్టుకుంది. 2018 ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్ సుమారు 58 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. దాంతో పాటు మల్లన్న సాగర్ ముంపు బాధితులు, నిరుద్యోగులు కూడా బరిలో ఉన్నారు. కాగా ఈసారి కేసీఆర్ ఎంత మెజారిటీతో గెలుస్తారని ఉత్కంఠ మొదలైంది.