Rohit Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ రైడ్స్.. రూ.20లక్షలు స్వాధీనం
X
ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రైడ్స్ మరోసారి కలకలం రేపాయి. వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తాండూరులోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు రూ.20 లక్షల నగదు, ఆయన తమ్ముడు రితీష్ రెడ్డి ఇంటి నుంచి రూ. 24 లక్షలతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాగా హైదరాబాద్ లోని మణికొండ ఇంటిలో కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. దాదాపు ఐదు చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే అనుచరుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు హైదరాబాద్ లోని పాత బస్తీలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వ్యాపారులే లక్ష్యంగా ఆదాయ పన్ను శాఖ తనిఖీలు చేపట్టింది. హోటల్ కింగ్స్ ప్యాలెస్ ఓనర్లతో పాటు, కోహినూర్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్ నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోహినూర్, కింగ్స్ గ్రూప్ పేరుతో హోటళ్లు నిర్వహిస్తున్న వీరంతా ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బులు సమకూర్చుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మేలో కూడా కోహినూర్ గ్రూప్ ఎండీ ఇండ్లు, ఆఫీసులతో పాటు హోటళ్లలో ఐటీ సోదాలు జరిగాయి. ఓల్డ్‌సిటీ, దాని చుట్టుపక్కల 30 ప్రాంతాల్లో ఉన్న కోహినూర్ గ్రూప్‌కు చెందిన ఆఫీసుల్లో తనిఖీలు చేశారు.