TS Assembly Elections 2023 : కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబ ఎక్కడుండేది - రేవంత్ రెడ్డి
X
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పెద్దపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ మరోసారి మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు. వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని రేవంత్ చెప్పారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాం సాగర్, నెట్టెంపాడు తదితర భారీ ప్రాజెక్టులను నిర్మించిన ఘనత కాంగ్రెస్ సొంతమని చెప్పారు. హైదారాబాద్ కు ఐటీ ప్రాజెక్టులు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు మంజూరు చేసిందని ఎవరని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం కోసం నెహ్రూ పోరాడి జైలుకెళ్తే, దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇన్నేళ్లుగా ఎంపీగా ఉన్నా రాహుల్ గాంధీకి సొంత ఇల్లులేదని అన్నారు. భారత్ జోడో యాత్రలతో రాహుల్ గాంధీ ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. కులాలు, మతాల పేరుతో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని రేవంత్ ఆరోపించారు.