TS Assembly Elections 2023 : కాంగ్రెస్కు అధికారమిస్తే వీఆర్ఏలు, గిర్దావర్లు వస్తరు - కేసీఆర్
X
ఎన్నికల సమయంలో అనేక అబద్దాలతో ఆపద మొక్కులతో వచ్చే వారుంటారని కేసీఆర్ అన్నారు. ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చే అలాంటి వారిని నమ్మొద్దని సూచించారు. 3 ఏండ్లు కష్టపడి రూపొందించిన ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారని మండిపడ్డారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వీఆర్ఓలు, గిర్దావర్లు వస్తారని, రైతులను కోర్టులు, కచ్చీరుల చుట్టూ తిప్పుతారని అన్నారు. అధికారుల్లో ఎవరికి కోపం వచ్చినా రైతుల భూమి ఆగమైతదన్న కేసీఆర్.. పల్లెల్ని పచ్చగా మార్చిన ధరణిని తొలగించి రైతుల హక్కుల్ని తీసేస్తామన్న కాంగ్రెస్ నాయకుల గురించి ఆలోచించాలని సూచించారు. తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని, ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కథ మళ్లీ మొదటికొస్తదని హెచ్చరించారు.
తొమ్మిదిన్నరేండ్ల పాలనలో తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, మంచినీటి సరఫరాలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా మారిందని కేసీఆర్ అన్నారు. సాగు, తాగు నీరు, కరెంటు గోస లేకుండా చేశామని చెప్పారు. 60 ఏండ్లు పాలించినా ఏనాడూ కడుపునిండా కరెంటియ్యని కాంగ్రెస్ ఇప్పుడు కూడా వ్యవసాయానికి 3 గంటలు చాలని అంటోందని గుర్తుచేశారు. ప్రధాని మోడీ సొంతరాష్ట్రమైన గుజరాత్ లో కూడా 24 గంటల కరెంట్ లేదని, కేవలం కేసీఆర్ మొండి పట్టుదలతోనే అది సాధ్యమైందని అన్నారు. పల్లెలు పచ్చగా ఉండాలన్న సంకల్పంతో కేంద్రం మోటర్లకు మీటర్లు పెట్టమన్నా పెట్టలేదని చెప్పారు. అన్నదమ్ముల్లా కలిసుంటే హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే వారితో జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు.