టార్గెట్ కాంగ్రెస్.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సంచలన పథకాలు..!
X
అసెంబ్లీ ఎన్నికలకు 4 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్.. మిగతా పార్టీల కన్నా ముందే మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 16న వరంగల్ వేదికగా మేనిఫెస్టో విడుదల చేయనుంది. డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండటంతో అప్రమత్తమైన సీఎం కేసీఆర్ అస్త్రాలను బయటకు తీయనున్నట్లు సమాచారం.
హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు 4 నెలల ముందే అభ్యర్థుల్ని ప్రకటించడంతో వారంతా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతున్నారు. బీఆర్ఎస్కు మళ్లీ అధికారం అప్పగిస్తే చేసే అభివృద్ధి గురించి జనానికి వివరిస్తారు.
ఇదిలాఉంటే కర్నాటక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర కాంగ్రెస్లో జోష్ పెరిగింది. తెలంగాణలో ఈసారి అధికారం తమదేనన్న ధీమా పెరిగింది. ప్రభుత్వవైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్న అంశాలపై జనానికి స్పష్టత ఇస్తోంది. ఈ క్రమంలోనే అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పలు డిక్లరేషన్లు ప్రకటించింది. అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు గ్యారెంటీలను ప్రజల ముందుంచింది.
కాంగ్రెస్ వ్యూహాలు చాలా వరకు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలపై జనాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పలువురు బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ ను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్కు చెక్ పెట్టి జనాన్ని బీఆర్ఎస్ వైపు తిప్పుకునేందుకు అస్త్రాలు బయటకు తీసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
గ్రామీణ ప్రాంతాల ప్రజలే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సరికొత్త పథకాలకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. నెలకు ఆరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు వృద్ధాప్య పింఛను మొత్తాన్ని పెంచాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేలా రైతుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వారికి ప్రతినెలా రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని బీఆర్ఎస్ డిసైడైనట్లు పార్టీ వర్గాల్ో చర్చ నడుస్తోంది. అక్టోబర్ 16న విడుదల చేయనున్న మేనిఫెస్టోలో ఈ పథకాలను ఇప్పటికే చేర్చినట్లు సమాచారం.