TS Assembly Elections 2023 : ఆగమాగం కావొద్దు.. ఆలోచించి ఓటేయండి.. సీఎం కేసీఆర్
X
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలవాలి.. అప్పుడే ప్రజల కోరికలు తీరుతాయి.. అందుకే ఆలోచించి ఓటేయాలి అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజల హక్కుల కోసమే భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పుట్టిందన్నారు. 15 ఏళ్ల నిర్విరామంగా పోరాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. పదేళ్లు తెలంగాణను ఆశీర్వదించారని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి.. ఎన్నికలు అన్నప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. అందర్నీ ఒకటే ప్రార్థిస్తున్నాను. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇప్పటికి ప్రజాస్వామ్య పరిణితి రాలేదు. ఏ దేశాల్లో అయితే అది వచ్చిందో ఆ దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఎన్నో రెట్లు ముందున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఒక వజ్రాయుధం ఓటు. మీ ఓటు మీ తలరాతను లిఖిస్తది వచ్చే ఐదేండ్లు. పార్టీల అభ్యర్థలు మంచి చెడు తెలుసుకోవాలి. అభ్యర్థులు గెలవడంతో ప్రభుత్వం ఏర్పడతుంది. ఏ ప్రభుత్వం ఏర్పడితే లాభమేనేది చర్చ జరగాలి. ప్రతి పార్టీ చరిత్ర చూడాలి. ఆయా పార్టీల హాయాంలో ఏం జరిగిందో ఆలోచించాలి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. పార్టీ వైఖరి తెలుసుకోవాలి. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తది.. నడవడి ఎట్ల ఉన్నది అనేది గమనించాలి. అప్పుడు ఎన్నికల్లో ప్రజలు గెలుస్తరు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలుస్తే మీ కోరికలు నెరవేరుతాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘‘తెలంగాణ గ్రామాలు పచ్చబడాలంటే ఏం చేయాలనేదానిపై ఎంతో ఆలోచన చేశాం. రాష్ట్రంలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే ఉద్దేశంతోనే రైతుబంధు తీసుకొచ్చాం. ఎన్నికల కోసం తీసుకొచ్చింది కాదు. తెలంగాణలో నీళ్లు ఉచితమే. కరెంటు ఉచితమే. రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేస్తున్నాం. ఇప్పటికే రైతుల రుణమాఫీ చేశాం. ఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మరికొంత మందికి పూర్తి చేయలేక పోయాం. గతంలో రైతులకు సాయం చేయాలని ఎవరూ ఆలోచించలేదు. కాంగ్రెస్ నేతలు ఇవాళ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రైతుబంధు దుబారా ఖర్చు అని అంటున్నారు. ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా కూడా పోతాయి’’ అని కేసీఆర్ అన్నారు.