KCR : బీఆర్ఎస్‌ని గెలిపిస్తే.. షాద్‌నగర్ వరకు మెట్రో: సీఎం కేసీఆర్
X
మంచివాళ్లకు ఓటేస్తే మంచి ప్రభుత్వం వస్తుందని, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వివేకంతో వేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. షాద్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని, ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌కు మద్దతుగా ప్రసంగించారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే షాద్‌నగర్ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత తనదన్నారు. "అంజయ్య యాదవ్.. షాద్ నగర్ కు ఒక మెడికల్ కాలేజీ రావాలని కోరారు. నేను తప్పకుండా మెడికల్ కాలేజీ మంజూరు చేస్తాను. పీజీ కాలేజీలు కొన్ని అడిగారు. మీకు చాలా విద్యాసంస్థలు వస్తాయి హైదరాబాద్ పక్కకే ఉంటది కాబట్టి. ఒకసారి మెట్రో వస్తుందని తెలిస్తే మీ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. అన్ని విద్యాసంస్థలు వస్తాయి. కాలుష్య రహిత పరిశ్రమలు కూడా తరలివస్తాయి. దండం పెట్టుకుంట వస్తాయి. షాద్‌నగర్‌కు మెట్రో వస్తుందని తెలిసిన తర్వాత దీనికి డిమాండ్ తారాజువ్వాలా లేచిపోయింది. అంజయ్య లాంటి ఎమ్మెల్యే ఉంటే ప్రజల కోసం పాటు పడే ఎమ్మెల్యే ఉంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి" అని కేసీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. అనేక రకాలుగా షాద్‌నగర్ అభివృద్ధి కావడానికి అవకాశం ఉందన్నారు కేసీఆర్. అలా కాకుండా అధికారాన్ని కాంగ్రెస్ చేతిలో పెడితే ఆగమై పోయే అవకాశం ఉంటుందని చెప్పారు. "అంజయ్య యాదవ్ అజాత శత్రువు. ఈగకు, దోమకు కూడా అన్యాయం చేసే మనిషి కాదు. ప్రజల కోసం పని చేస్తడు. ఇక్కడే ఉంటడు. ప్రజల మధ్యనే ఉంటడు. ఇటువంటి మంచి మనిషిని గ్యారెంటీగా కాపాడుకోవాలి. ఇక్కడ అభివృద్ధి బాధ్యత వందకు వంద శాతం నాది. నూటికి నూరు శాతం బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. అందులో అనుమానం అవసరం లేదు" అని కేసీఆర్ స్పష్టం చేశారు.