Home > తెలంగాణ > Telangana Elections 2023 > కాంగ్రెస్‌కు షాక్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పార్టీకి గుడ్ బై

కాంగ్రెస్‌కు షాక్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పార్టీకి గుడ్ బై

కాంగ్రెస్‌కు షాక్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పార్టీకి గుడ్ బై
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన వారికి హస్త పార్టీ రిక్తహస్తం చూపించడంతో పలువురు నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డిలు రాజీనామా చేశారు. ఇక, మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి బోడ జనార్ధన్ సైతం గుడ్ బై చెప్పారు. ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కిరణ్ కొమ్రేవార్ కూడా రాజీనామా చేశారు.

నేతల రాజీనామాలతో ఒక్క రోజులోనే ఉమ్మడి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ ఖాళీ అయింది. పార్టీలు మారి వచ్చిన వారి కి టికెట్లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేసిన నేతలు అంటున్నారు. నమ్ముకున్న కాంగ్రెస్‌ తనకు తీరని అన్యా యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా గుర్తింపు లేకుండా పోయిందని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఉద్వేగానికి గురయ్యారు. ఆరెస్సెస్‌ భావజాలం ఉండి, బీజేపీ నుంచి వచ్చిన కంది శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారని పేర్కొన్నారు. ప్యారాచూట్‌ నాయకులకు కాకుండా తమ ముగ్గురిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలిసి పనిచేసి ఉండేవాళ్లమని చెప్పారు. కాంగ్రెస్‌ రెబల్‌గా సంజీవ్‌రెడ్డి బరిలో ఉంటారని, పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

నిర్మల్‌ జిల్లా ముథోల్‌ టికెట్‌ను ఆశించిన కిరణ్‌ కొమ్రేవార్‌ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేశారు. తనకే టికెట్‌ ఇస్తామని రేవంత్‌ చెప్పారని, ఇప్పుడేమో అసలు దరఖాస్తే చేసుకోని నారాయణరావు పటేల్‌కు టికెట్‌ ఎలా ఇస్తారని నిలదీశారు. అన్యాయం చేసిన పార్టీలో ఉండలేకే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్‌లోని తాజా పరిణామాలు పార్టీశ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి.

మంచిర్యాల జిల్లా చెన్నూరు టికెట్‌ను గడ్డం వివేక్‌కు ఇవ్వడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు భగ్గుమన్నారు. వివేక్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం డాక్టర్‌ రాజారమేశ్‌ పార్టీకి రాజీనామా చేసి కలకలం రేపారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి బోడ జనార్దన్‌ సోమవారం ప్రకటించారు. పార్టీలో కనీసం మూడేళ్లుగా ఉన్న వారికే టికెట్‌ ఇస్తామని చెప్పి ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చిన వివేక్‌కు టికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకే రాజీనామా చేశానని, వివేక్‌ను ఓడించి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. కాగా, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరారు బోడ జనార్దన్‌.




Updated : 7 Nov 2023 11:18 AM IST
Tags:    
Next Story
Share it
Top