TS Assembly Elections 2023 : రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న రేఖా నాయక్
X
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శుక్రవారం ఆర్మూర్లో జరిగే సభలో అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకోనున్నారు. బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆమె భర్త కాంగ్రెస్లో చేరారు. మరోవైపు.. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా ఈనెల 21న కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా హస్తం పార్టీలో చేరాలని రేఖా నాయక్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తనకు టికెట్ ఇవ్వకుండా భుక్యా జాన్సన్ నాయక్ కు కేటాయించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని రేఖా నాయక్ ఇప్పటికే ప్రకటించారు. ఖానాపూర్ ప్రజలు స్థానికేతరుల కారణంగా చాలాసార్లు మోసపోయిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె.. 9ఏండ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసిన తనను నమ్మించి మోసం చేశారని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే రేఖా నాయక్ వ్యవహార శైలిపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తితో ఉండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సారి ఆమెకు టికెట్ నిరాకరించారు. మంత్రి కేటీఆర్ స్నేహితుడైన భుక్యా జాన్సన్ నాయక్కు అవకాశమిచ్చారు.