TS Assembly Elections 2023 : పార్టీలోకి చేరగానే రేవంత్ రెడ్డిపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్
X
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే బలంగా కనిపిస్తోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందువల్లే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చానని.. అంతే కానీ పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. ప్రజాసంక్షేమమే తన ధ్యేయమని.. పదవుల కోసం తాను ఎన్నడూ పాకులాడలేదని చెప్పారు. హై కమాండ్ అవకాశం ఇస్తే మునుగోడులో పోటీ చేసి కాంగ్రెస్‌కు విజయం సాధించి తీసుకువస్తానని తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గజ్వేల్‌లోనూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే సమయం వచ్చేసిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెబుతారని.. కాంగ్రెస్‌ను తప్పకుండా ఎన్నుకుంటారన్న నమ్మకం తనకు ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు.
అయితే.. పార్టీలో చేరుతూనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చని చెప్పారు. విబేధాల్ని పక్కనబెట్టి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తారా అనే ప్రశ్నకు.. కాంగ్రెస్ పార్టీలో పదవులు శాశ్వతం కాదని, రేవంత్ రెడ్డికి సైతం టీపీసీసీ పదవి శాశ్వతం కాదు కదా అని బదులిచ్చారు. రెండు నెలల తరువాత ఎవరైనా అధ్యక్షుడు కావచ్చన్నారు.
కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవలే బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి బీజేపీ నుంచి పోటీ చేశారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్ధి చేతిలో పరాజయం పొందారు. అప్పట్నించి బీజేపీలో అంత యాక్టివ్‌గా లేని రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సొంతగూటికి వచ్చేశారు. వాస్తవానికి శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉన్నా..సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభానికి ముందే పార్టీ సభ్యత్వం ఉండాలన్న సాంకేతిక కారణంతో హడావిడిగా పార్టీలో చేరిపోయారు.