TS Assembly Elections 2023 : వేరే ప్రాంతాల నుంచి వచ్చి.. హైదరాబాద్లో గెలిచిన నేతలు వీరే
X
హైదరాబాద్ ఓ చారిత్రక మహానగరం. ఈ గడ్డ.. ఎన్నో భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనం. దేశ నలుమూలల నుంచి వచ్చిన చాలామందికి వివిధ రంగాల్లో అవకాశాలిచ్చింది. విద్య, ఉద్యోగం, ఉపాధి అంటూ వచ్చిన వారిని అక్కునచేర్చుకుంది. ఉపాధికల్పించి.. కడుపు నింపింది. సామాన్యులనే కాదు.. ప్రజల మనసును గెలిచినవారిని నాయకులుగా అందించింది. ఎక్కడెక్కడినుంచో వచ్చిన వారికి.. కుల, మత, ప్రాంతం, పార్టీలనే విభాదాలు లేకుండా ఎన్నికల్లో గెలిపించింది. వారికి జై కొడుతూ చట్ట సభలకు పంపించింది. ఇలా వేరే ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎంలుగా, మంత్రులుగా రాష్ట్రానికి సేవలందించారు. అలా వేరే ప్రాంతాలనుంచి వచ్చి హైదరాబాద్ లోని నియోజకవర్గాల్లో గెలిచిన నేతల వివరాలు..
⦿ 1952లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు జీఎస్ మెల్కోటే. హైదరాబాద్ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈయన ఒడిశాలోని బరంపురలో జన్మించారు.
⦿ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సరోజిని పుల్లారెడ్డి.. 1965లో హైదరాబాద్ మేయర్ గా, 1967, 1972లో మలక్పేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
⦿ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డిది కూడా హైదరాబాద్ కాదు. ఆయన స్వస్థలం వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి. 1978లో మేడ్చల్, 1989లో సనత్ నగర్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
⦿ తుక్కుగూడకు చెందిన తూళ్ల దేవేందర్ గౌడ్.. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు. 1994,1999, 2004లో మేడ్చల్ నుంచి గెలిచారు.
⦿ తెలంగాణ తొలి మంత్రి నాయిని నరసింహారెడ్డిది నల్గొండ జిల్లాలోని నేరేడుగొమ్ము. 1985, 2004లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు.
⦿ ప్రస్తుతం త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిది సూర్యపేట జిల్లా గానుగబండ. 1983, 1985, 1999 ఎలక్షన్స్ లో మలక్పేట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
⦿ నటి జయసుధది మద్రాస్. వందలాది సినిమాల ద్వారా తెలుగు సినిమాల ద్వారా ప్రజలకు పరిచయమై.. 2009లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
⦿ రంగారెడ్డి జిల్లా తిమ్మూపూర్ కు చెందిన కిషన్ రెడ్డి.. 2009, 2014లో అంబర్ పేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు.
⦿ లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణది మహారాష్ట్ర. 2014లో కూకట్ పల్లి ఎమ్మెల్యేగా గెలిచారు.
⦿ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్యది వికారాబాద్ జిల్లాలోని రాళ్లగుడుపల్లి. ఆయన 2014లో ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
⦿ మైనంపల్లి హనుమంతరావుది మెదక్ జిల్లా కొర్విపల్లి. 2018లో బీఆర్ఎస్ తరుపున మల్కాజిగిరిలో పోటీ చేసి గెలిచారు.