KTR Nomination Harish Rao Nomination : సిరిసిల్లలో కేటీఆర్, సిద్ధిపేటలో హరీశ్ రావు.. కొనసాగుతున్న నామినేషన్ల పర్వం..
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపటి(శుక్రవారం)తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ప్రధాన పార్టీల నేతలంతా సకాలంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్ నేడు రెండు చోట్ల నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్‌లో ఉదయం 11 గంటలకు నామినేషన్ వేయగా.. కామారెడ్డిలో మరికాసేపట్లో నామినేషన్ వేయనున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలో నామినేషన్ వేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు. మరో ప్రముఖ టీఆర్ఎస్ నేత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఈరోజు సిద్దిపేటలో నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు సిద్దిపేట వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు చేశారు.
టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇప్పటికే అయ్యప్ప స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు భట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.