TS Assembly Elections 2023 Z: కర్ణాటక రైతుల ఆందోళన.. అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
X
రాష్ట్రంలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు అమలు కావడం లేదని, మా మాదిరి తెలంగాణలో నష్టపోవద్దని కర్ణాటక రైతులు రెండు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ వాసులు కాంగ్రెస్‌కు ఓటు వెయ్యొద్దని నినాదాలు చేశారు. నారాయణఖేడ్ జంట గ్రామమైన మంగల్‌పేట నుంచి సుమారు 60 మంది రైతులు కర్ణాటకలో హామీలు అమలు కావడంలేదని నినాదాలతో ప్రదర్శనగా రాగానే స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఇక అదే సమయంలో పరిగిలో కూడా ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి రోడ్‌షో సందర్భంగా కొడంగల్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కర్ణాటక రైతులు. బీజాపూర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ‘కర్ణాటక మాదిరి మీరు.. నష్టపోరాదని’ ప్లకార్డులతో ర్యాలీగా రైతులు రావడం, కొద్ది సమయం తేడాతో రెండు రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు డీకే.శివకుమార్, రేవంత్‌రెడ్డి పరిగి పర్యటన ఉండటంతో స్థానిక కాంగ్రెస్ నేతలు నిరసన తెలుపుతున్న వారిని అడ్డుకున్నారు. ప్లకార్డులు చించివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తడంతో పోలీసులు రంగంలో దిగి వారికి సర్దిచెప్పారు
అయితే కర్ణాటక నుంచి వచ్చినవారు రైతులు కాదని... వారిలో అడ్డా కూలీలు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని పీసీసీ ఎస్టీసెల్ ఉపఛైర్మన్ భీంరావునాయక్, ఎస్టీ సెల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ఖేడ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దీపక్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రోద్బలంతో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఖేడ్ ఎస్సై విద్యాచరణ్‌రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.