TS Assembly Elections 2023 : పాలమూరు పాలుగారే జిల్లాగా, బంగారు తనకగా మారుతది - సీఎం కేసీఆర్
X
(TS Assembly Elections 2023) జడ్చర్లను అద్బుతమైన పరిశ్రమల కేంద్రంగా మారుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ కు అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతం త్వరలోనే మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పోలేపల్లి సెజ్ ద్వారా అనేక మందికి ఉపాధి లభిస్తోందన్న ముఖ్యమంత్రి.. రానున్న రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అన్నారు.
స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత మహబూబ్ నగర్ జిల్లాను వీలైనంత అభివృద్ధి చేసుకున్నామని కేసీఆర్ చెప్పారు. మంచినీళ్ల బాధ నుంచి విముక్తి కల్పించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్నామని అన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండపూర్ రిజర్వాయర్లు ఇప్పటికే పూర్తికాగా.. మోటార్లు బిగిస్తున్నారని సీఎం చెప్పారు. 3 - 4 నెలల్లో నీళ్లు చూడబోతున్నామని పాలమూరు కరువు పోతదని ఆనందం వ్యక్తం చేశారు. ఉద్ధండపూర్ పూర్తైతే జడ్చర్లలోని లక్షా 50 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని, కరువు అనేది మనదిక్కు కన్నెత్తి కూడా చూడదని చెప్పారు. పాలమూరు ప్రాజెక్టు పనులు ఇంకా 10శాతం మిగిలి ఉన్నాయని అవి కూడా తొందరలోనే పూర్తవుతాయని స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పాలమూరు పాలుగారే జిల్లాగా, బంగారు తనకగా మారుతదని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలకు లబ్ది చేకూరేలా పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి అన్నారు. అగ్రవర్ణాల పేదలకు సైతం గురుకులాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం మేనిఫెస్టోలో హామీలు ఇవ్వలేదని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదని, రుణమాఫీతో రైతుల అప్పుల బాధలు తీరుతున్నాయని అన్నారు. మరో 10ఏండ్లు కష్టపడితే దేశంలోనే గొప్పరైతులుగా తెలంగాణ అన్నదాతలు మారుతారని అభిప్రాయప్డడారు. ఉద్దండాపూర్ నిర్వాసితులకు వీలైనంత తొందరగా పరిహారం అందేలా చూస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకుని ముందుకెళ్తున్న కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.