Telangana Assembly Elections : స్పెషల్ హామీలు, భరోసాలు.. కుల సంఘాల ఓట్లపై అన్నిపార్టీల గురి
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా కుల సంఘాలు, మత రాజకీయాలపైనే చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు కూడా వాళ్ల ఓటు బ్యాంకునే టార్గెట్ చేస్తూ.. హామీలు ప్రకటిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. వివిధ సంఘాల మద్దతును కూడగట్టడం కోసం వారి వద్దకే వెళ్లి సంఘం నిర్వహించిన సభల్లో పాల్గొంటున్నారు. గంప గుత్తగా ఓట్లు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థలాలు కేటాయించి, సంఘ భవనాలు కట్టిస్తామని, ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయనే దానిపై పూర్తి డేటాను తీసుకుని.. ఆయా నియోజకవర్గాల్లో పనులు మొదలుపెట్టారు. ఎన్నికల్లో ప్రభావం చూపే సంఘాలతో మీటింగ్స్ ఏర్పాటుచేసి వాళ్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలుచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు మద్దతిస్తే అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.
ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న ఓటు బ్యాంకుపై అభ్యర్థులు దృష్టిపెట్టారు. ఓటు బ్యాంకు ఉన్న ముదిరాజ్, మున్నూరు కాపులు, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనార్టీ ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కులాలే కాకుండా మేస్త్రీ, సెంట్రింగ్, ప్లంబింగ్ పనులు చేసే వారి సంఘాలు, పట్టణ ప్రాంతాల్లో కిరాణ, వర్తక, హమాలీ సంఘాలపై కూడా స్పెషల్ ఫోకస్ చేశాయి పార్టీలు. ఆయా సంఘాల వారితో సంప్రదింపులు జరిపి ఎన్నికల్లో మద్దతు కోసం హామీలు ఇస్తున్నారు. ఇటీవలే మెదక్ లో ర్యవైశ్య, మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞత సభలు ఏర్పాటుచేశారు. ఆర్యవైశ్య సభకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ గౌడ్ హాజరవగా.. మున్నూరు కాపు సభకు పద్మతో పాటు మంత్రి గంగుల కమలాకర్, రవిచంద్ర హాజరయ్యారు. ఎన్నికల్లో మద్దతిస్తే ఆయా సంఘాల కోసం పట్టణాల్లో స్థలాలు, బిల్డింగ్ ల నిర్మాణానికి రూ. కోటి చొప్పున నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
బీజేపీ ఇప్పటికే బీసీ నినాదాన్ని ప్రకటించింది. ఆ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కూడా ఎక్కువమంది బీసీలకే టికెట్లు కేటాయించింది. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. మెదక్, నర్సాపూర్ స్థానాల్లో బీసీ ఓటర్ల మేజారిటీ ఎక్కువ ఉండటంతో ఆ సీట్లను పంజా విజయ్ కుమార్, మురళీ యాదవ్ లకు కేటాయించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అగ్రవర్ణాలకే టికెట్లు ఇస్తున్నారని చెప్పుకొస్తున్నారు. బీసీల సమస్యలు తీరాలన్నా, ఆర్థిక అభివృద్ధి జరగాలన్నా బీసీ ఎమ్మెల్యే ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్తున్నారు. బీసీ సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ లో మైనార్టీ, గిరిజన ఓటర్ల సమ్మేళనాలు నిర్వహించింది. మైనార్టీ సమ్మేళనానికి హోంమంత్రి మహముద్ అలీ, గిరిజన సమ్మేళనానికి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. గడిచిన పదేళ్లలో ఆయా సంఘాలకు చేసిన అభివృద్ధి పనులను వివరించారు. రానున్న ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరారు.