Harish Rao : 'దేవుని దగ్గర మొక్కినా అన్ని పనులు కావు'.. మంత్రి హరీష్ రావు
X
ఎన్నికలంటే ఐదేళ్ల భవిష్యత్తు అని, వచ్చే ఐదేళ్లలో ఎవరైతే మేలు చేస్తారో వారికే ఓటెయ్యాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రావు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోహెడలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో మంత్రి మాట్లాడుతూ... కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కొహెడ, హుస్నాబాద్ ఎంతగా అభివృద్ధి అయ్యాయో గమనించాలన్నారు. గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో హుస్నాబాద్ లో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవన్నారు. రహదారులు లేవన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో సతీష్ ఎమ్మెల్యే అయ్యాక హుస్నాబాద్ రెవిన్యూ డివిజన్ అయిందని , హుస్నాబాద్ కు డీఎస్పీ ఆఫీస్ , డీఈ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వచ్చిందన్నారు. కొహెడలో మార్కెట్ యార్డ్ కావాలంటే మంజూరు చేశామన్నారు. కొహెడలో చెక్ డ్యాంలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కాలమైనా , కాకపోయినా ఈనాడు కాళేశ్వరం నీళ్లతో శనిగరం చెరువుతో రెండు పంటలు పండుతున్నాయన్నారు. కేసీఆర్ లేకపోతే కాళేశ్వరం లేదని చెప్పారు.
ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్ నేతలు బయటకొచ్చారని, కరోనా టైమ్ లో కనబడని కాంగ్రెసోళ్లు ఇప్పుడు వచ్చి ఆరు గ్యారంటీలు అంటూ జనాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇలా హామీలిచ్చే కర్నాటక ప్రజలను మోసం చేశారని, అక్కడి రైతులే ఈ విషయాన్నే చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే మళ్లీ ఆగమైతమన్నారు. ఎన్నికలంటే ఐదేళ్ల భవిష్యత్తు, ఆలోచించి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు రాదని చెప్పారు. కేసీఆర్ కి ఓటేస్తేనే రైతు బంధు ఉంటుదన్నారు.
మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వమొస్తే... ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేస్తామన్నారు హరీశ్ రావు. మూడోసారి అధికారంలోకి రాగానే రేషన్ షాప్ లలో సోనామసూరి బియ్యం అందిస్తామన్నారు. పెన్షన్లను రూ.5 వేలకు పెంచుతామన్నారు. ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యాక రూపాయి కి 90 పైసల పని చేశారని, ఒకటో రెండో పనులే మిగిలి ఉన్నాయన్నారు. దేవుని దగ్గర మొక్కినా దేవుడు అన్ని ఇయ్యడని, దేవుని దగ్గరే అన్నీ కావు.. గవర్నమెంట్ దగ్గర అన్ని అయితయా అని అడిగారు.