TS Assembly Elections 2023 : వ్యవసాయాన్ని దండగ చేసిన పార్టీ కాంగ్రెస్: హరీశ్‌రావు
X
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ఆ పార్టీ నేత , మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన బూత్ కమిటీల సమావేశంలో మంత్రి హారీశ్ రావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. సకాలంలో రైతుబంధు అందకుండా కుట్రలు చేస్తుందని , ఆ పార్టీకి రైతుల పట్ల కనికరం లేదని అన్నారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ దండగ చేస్తే... తమ ప్రభుత్వం పండగ చేసిందన్నారు.
తాము ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చి విస్మరించమని.. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుబంధు వంటి పథకం అమలు చేశామన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చి.. రైతులను కేసీఆర్ ఆదుకున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ సర్కార్ ఇస్తున్న రైతుబంధుతో రైతులు సంతోషంగా ఉన్నారని, 69 లక్షల మందికి రైతు బంధు అందుతోందని చెప్పారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే ప్రభుత్వ పథకాలు ఆపాలని అంటారేమోనని మంత్రి సెటైర్లు వేశారు. రైతులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా.. రైతు బంధు నిధులు ఆపాలంటూ ఎన్నికల కమిషన్ ను ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఏం చేసినా అధికారంలోకి రారని.. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 69 లక్షల మంది రైతులు కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేస్తారన్నారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 5 గంటల కరెంటు కూడా సరిగా రావడం లేదని.. తెలంగాణలో ఆ పార్టీకి అధికారమిస్తే రేవంత్ చెప్పినట్లు 3 గంటల కరెంటే ఇస్తారన్నారు. తెలంగాణ రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించాలంటే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు.