Konda Surekha : ప్రజా వాణిలో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తాం.. మంత్రి కొండా సురేఖ
X
ప్రజా వాణిలో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యవరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ప్రజా వాణికి వచ్చే ప్రతి ఒక్కరి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని అన్నారు. వారి నుంచి అర్జీలను తీసుకొని ప్రతి అర్జీకి ఒక నంబర్ కేటాయిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా అర్జీ ముట్టినట్లు అర్జీదారుల ఫోన్లకు మెసేజ్ లు పంపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రజా వాణిలో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్ అధికారులు ముషారఫ్ అలీ, హరిచందన, వెంకటేశ్ దొత్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ గా పేరు మార్చింది. అలాగే ప్రజా దర్బార్ పేరిట ప్రజల సమస్యలను చెప్పుకోవడానికి లోపలకి అనుమతినిచ్చింది. అయితే ప్రజా దర్బార్ పేరును ప్రజా వాణిగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రజా వాణికి ఇప్పటికే 5 వేలకు పైగా వినతి పత్రాలు వచ్చినట్లు ప్రజా భవన్ అధికారులు తెలిపారు.