Home > తెలంగాణ > Telangana Elections 2023 > అటు కేటీఆర్ ఇటు ఓవైసీ బ్రదర్స్.. ఒక్కసారిగా రేవంత్ను ఎందుకు టార్గెట్ చేశారంటే..?

అటు కేటీఆర్ ఇటు ఓవైసీ బ్రదర్స్.. ఒక్కసారిగా రేవంత్ను ఎందుకు టార్గెట్ చేశారంటే..?

అటు కేటీఆర్ ఇటు ఓవైసీ బ్రదర్స్.. ఒక్కసారిగా రేవంత్ను ఎందుకు టార్గెట్ చేశారంటే..?
X

తెలంగాణలో ముస్లిం ఓటర్లు ఏ పార్టీ వైపు ఉన్నారు.?. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వైపు ఉన్న ముస్లింలలో ఇప్పుడు మనసు మార్చుకున్నారా..? బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏదో ఉందన్న అనుమానం ముస్లిం సమాజంలో బలపడుతుందా..? ముస్లింలకు గుత్తేదారుగా చెప్పుకునే ఎంఐఎం పార్టీని ఆ వర్గాలు నమ్మడం లేదా..? రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ తాజాగా చేస్తున్న రాజకీయంతో తెలంగాణలో కొత్తగా పుట్టుకొస్తున్న ప్రశ్నలివి. నిన్న మొన్నటిదాక రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతమైందని.. వార్ బీఆర్ఎస్ సైడ్ అని అప్పట్లో వచ్చిన పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ తెలంగాణలో కొత్త టర్న్ తీసుకున్నాయి. కర్నాటక ఫలితంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ భారీగా పెరిగిందన్న టాక్ వినిపిస్తోంది. గతంలో దూరమైన కొన్ని వర్గాల ఓటర్లు సైతం హస్తం పార్టీ వైపు చూస్తున్నారనే వాదనలు బలపడుతున్నాయి.

బీఆర్ఎస్ వైపు ముస్లింలు..

దేశవ్యాప్తంగా ముస్లింలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత ముస్లింలు హస్తం పార్టీ వైపు మళ్లినట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇందుకు తెలంగాణ అతీతమేమికాదని గాంధీభవన్ లో నడుస్తున్న చర్చ దారుల్ సలాంకు వయా ప్రగతి భవన్ చేరినట్లు తాజా రాజకీయ ఆరోపణలతో అర్ధమవుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముస్లింలు బీఆర్ఎస్ వైపు ఉన్నారన్నది జగమెరిగిన సత్యం. ముస్లిం సమాజానికి రాజకీయ ప్రతినిధిగా ఎంఐఎంను భావిస్తున్న బీఆర్ఎస్ ఆ పార్టీతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తోంది. చూపించుకోవడానికి పొత్తు లేకున్నా చెప్పుకోవడానికి ఆ రెండు పార్టీల మధ్య మంచి దోస్తానా ఉంది. స్వతహాగా ముస్లిం పక్షపాతిగా కనిపించే సీఎం కేసీఆర్ ఆ వర్గాలను ఆకర్షించేందుకు పలు పథకాలనూ అమలు చేస్తున్నారు.

బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ..

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు అటు ఓవైసీ బ్రదర్స్ - ఇటు మోదీ, షాలతో ఏకకాలంలో సత్సంబంధాన్ని బీఆర్ఎస్ కొనసాగించింది. అడగపోయినా కీలక సందర్భాల్లో బీజేపీకి అండగా నిలిచింది. బహిరంగంగా చెప్పకపోయినా లోలోపల బీజేపీకి బీఆర్ఎస్ సహకరిస్తుందన్న విమర్శలు అప్పటినుంచే ముస్లిం మేధావుల నుంచి వచ్చాయి. కానీ ఈ వాదనలను సామాన్య ముస్లింలు అంతగా పట్టించుకోలేదు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య సంబంధాన్ని బలంగా ముస్లిం సమాజంలోకి తీసుకపోవడంలో నాటి కాంగ్రెస్ నాయకత్వం విఫలమైంది. కానీ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక పరిస్థితి మారింది.

కాంగ్రెస్ వైపు ముస్లిం సమాజం

విద్వేష బజార్లో ప్రేమ దుకాణాన్ని తెరిచానంటూ రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో తెలంగాణ ముస్లిం సమాజం కాంగ్రెస్ వైపుకు మళ్లినట్లు ఓ చర్చ నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్కు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం సమాజాన్ని మళ్లీ కాంగ్రెస్ వైపు తీసుకరావడాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పెట్టుకుని రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేశారని సమాచారం. ఇందులో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య బలమైన సంబంధం ఉందని రేవంత్ రెడ్డి వినిపించిన వాదనను సామాన్య ముస్లింలు కూడా నమ్మారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

రేవంత్ వ్యూహంతో..

లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కాకపోవడంతో పాటు పలు సందర్భగాల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్ధతిచ్చిన విషయాలపై రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు ముస్లిం సమాజాన్ని ఆలోచనలో పడేశాయని కొంతమంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీంతోపాటు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ముస్లింలకు ఎప్పటిలాగే అన్యాయం కొనసాగుతోందని కొన్ని ముస్లిం సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు, చర్చాగోష్ఠిలు నిర్వహిస్తున్నాయి. వీటన్నింటి కారణంగా ముస్లిం సమాజంలోని మెజార్టీ వర్గం కాంగ్రెస్ వైపు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ తరుచుగా చేయించే సర్వేల్లోనూ ఈ విషయం బయటపడడంతో ఆయన అలర్ట్ అయ్యారని సమాచారం.

రేవంత్ ఆర్ఎస్ఎస్ మనిషి..

ఈ కారణంగానే రేవంత్ ఆర్ఎస్ఎస్ మనిషి అన్న పాత చర్చను మళ్లీ కొత్తగా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. గంపగుత్తగా ఒకేపార్టీకి ఓటు వేసే స్వభావం ఉన్న ముస్లిం సమాజం కాంగ్రెస్ వైపుమళ్లకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ బీఆర్ఎస్ ఎంఐఎం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే ముందుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ - ఎంఐఎం టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అన్న విషయాన్ని ముస్లిం సమాజంలోకి బలంగా తీసుకెళ్లేందుకు కేటీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారన్న సంగతి తాజా ఆరోపణలతో రుజువైంది. ఇన్నిరోజులు ముస్లింలకు తామే ప్రతినిధులమని చెప్పుకున్న ఓవైసీ బ్రదర్స్ కూడా రంగంలోకి దిగి రేవంత్ సంఘ్ నేపథ్యాన్ని ఎండగడుతున్నారు.

ఎంఐఎంకు ఝలక్..?

బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎంకూ ఝలక్ ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాతబస్తీపైన గట్టిగానే నజర్ పెట్టింది. నాంపల్లితో పాటు మరో స్థానంలో ఎలాగైన గెలిచేందుకు పటిష్ఠమైన ప్రణాళికను రచిస్తోంది. ముస్లిం మేధావులతో పాటు ఎంబీటీ లాంటి పాత బస్తీ కేంద్రంగా పనిచేసే రాజకీయ పార్టీ నేతలకు కాంగ్రెస్ కండువా కప్పుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీవైపు ముస్లింలు వెళ్లకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఓవైసీ బ్రదర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే మారిన ముస్లిం సమాజ ఆలోచన ధోరణితో ఈ ఆరోపణలు ఎంతవరకు బీఆర్ఎస్ ఎంఐఎంలకు ఫలితాన్నిస్తాయో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.




Updated : 6 Oct 2023 3:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top