KTR : అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
X
రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ప్లేస్‌లో ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు (Minister KTR Fires on Amit Shah) మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని గతంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి ఓ పేపర్ క్లిప్పింగ్‌ను సైతం తన ట్వీట్‌కు జత చేశారు. ఆ పోస్ట్ లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... ఇప్పుడు కేంద్రంలోని NDA సర్కార్ చెప్పింది అబద్ధమా.. లేక అమిత్ షా చెప్పింది అబద్ధమా..? అంటూ ప్రశ్నలు సంధించారు. బక్వాస్ జూటా పార్టీ.. DNA మొత్తం అబద్ధాలు, జుమ్లాలే అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని.. ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంటే ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆదిలాబాద్‌లో అమిత్ షా ప్రసంగం అంతా అబద్ధాలేనని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్నికల్లో బీజేపీకి మళ్లీ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవ్వడం ఖాయమని ధ్వజమెత్తారు. కారు స్టీరింగ్ తమ చేతుల్లోనే ఉందని.. అయితే అమిత్ షా స్టీరింగే అదానీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు. ధైర్యముంటే అదానీపై మాట్లాడాలని సవాల్ విసిరారు. మోదీ, అమిత్ షాలు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం లేదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.