Home > తెలంగాణ > Telangana Elections 2023 > TS Assembly Elections 2023 : కాంగ్రెస్కు అధికారం ఇస్తే.. అంధకారమే : కేటీఆర్

TS Assembly Elections 2023 : కాంగ్రెస్కు అధికారం ఇస్తే.. అంధకారమే : కేటీఆర్

TS Assembly Elections 2023 : కాంగ్రెస్కు అధికారం ఇస్తే.. అంధకారమే : కేటీఆర్
X

కాంగ్రెస్కు అధికారం ఇస్తే.. అంధకారమే అని కర్రాటక దుస్థితిని చూసి తెలంగాణ ప్రజలకు అర్థమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణకు డీకే శివకుమార్ వచ్చి... కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఓవైపు కర్ణాటక ప్రజలు పుట్టెడు కష్టాలతో పడరాని పాట్లు పడుతుంటే వాటిని పట్టించుకోకుండా తెలంగాణలో ఓట్ల వేటకొచ్చారా అని నిలదీశారు.

కర్నాటక ప్రభుత్వ వైఫల్యాలను చూడటానికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. ‘‘ డీకే గారు కాంగ్రెస్ చేతిలో దగా పడ్డ రైతులే.. తెలంగాణకు వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ నుంచి పొంచి ఉన్న ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన మిమ్మల్ని కర్ణాటక ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఎన్నికల ప్రచారంలో ఐదు హామీలు అని అరచేతిలో వైకుంఠం చూపించారు. తీరా గద్దెనెక్కిన తరువాత సవాలక్ష కొర్రీలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు.

కర్నాటకలో కాంగ్రెస్ గృహజ్యోతి పథకం గాలిలో దీపంలా ఆరిపోయిందని కేటీఆర్ విమర్శించారు. ఎడాపెడా కరెంట్ కోతలు.. చార్జీల వాతలతో కర్ణాటక చీకటిరాజ్యంగా మారిపోయిందన్నారు. అక్కడి రైతులతో పాటు వాణిజ్య వ్యాపార సంస్థలు సైతం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘మీ అన్నభాగ్య స్కీమ్ పూర్తిగా అటకెక్కింది. రేషన్ పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న మా సంకల్పానికి.. కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని మీ అసమర్థ పాలనకు ఉన్న తేడాను తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంది. మహిళల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామన్న మీ గృహలక్ష్మి హామీకి కూడా గ్రహణం పట్టింది. కర్ణాటకలో సకల రంగాల్లో సంక్షోభానికి తెరదీసిన కాంగ్రెస్ను నమ్మి మోసపోవడానికి మా ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే.. ఇది తెలంగాణ గడ్డ.. చైతన్యానికి అడ్డ’’ అని కేటీఆర్ అన్నారు.


Updated : 29 Oct 2023 11:45 AM IST
Tags:    
Next Story
Share it
Top