Home > తెలంగాణ > Telangana Elections 2023 > సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్

సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్

సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ సవాల్
X

వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు బాగున్న ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. పనితీరులో అంతంతమాత్రంగానే ఉన్న ఎమ్మెల్యేలు తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయంలో సీఎం కేసీఆర్ ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది కాబట్టి.. ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. ప్రజలు బీఆర్ఎస్ను కాదని.. చిల్లర రాజకీయాలు చేసే నాయకులను పట్టించుకోవద్దని చెప్పారు.

సీఎం అభ్యర్థి ఎవరో చెప్పండి..?

రాష్ట్రంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోటీపడే పరిస్థితి లేదని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వస్తామనే భ్రమల్లో కాంగ్రెస్ ఉందన్న ఆయన.. రాష్ట్రంలో షర్మిల, కేఏ పాల్ లాంటి వాళ్ళు కూడా అధికారంలోకి వస్తామని చెప్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ 90 నుంచి 100స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి విధానాలను ఇతర రాష్ట్రాలలో అమలు చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవొద్దు..

సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనేది తన వాదన కాదని.. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే తన వాదన అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు ఉండాలని చెప్పారు. ఒక్క ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పెరిగే సీట్లు.. మొత్తం దక్షిణాది రాష్ట్రాల సీట్ల కన్నా ఎక్కువగా ఉండనుందని ఆరోపించారు.

దేశ ప్రగతికి మద్దతు ఇచ్చిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకూడదని.. అలాంటి పరిస్థితి వస్తే ఎవరూ సహించరని మండిపడ్డారు. ఇప్పటి నుంచే లోక్సభ స్థానాల పెంపుపై ఆరోగ్యవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది..

బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు, నిధులు, నియామకాల స్పూర్తికి అనుగుణంగా పనిచేస్తుందని కేటీఆర్ వివరించారు. సమగ్ర, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధిని సాధించామన్నారు.

విద్యా వైద్య రంగంలో తెలంగాణ అద్భుతమైన మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. నూతన పాఠశాలలు, గురుకులాల ఏర్పాటు, మన ఉరు మన బడి వంటి కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో గుణాత్మకమైన మార్పు సాధ్యమైందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ తనదైన మార్క్ వేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్నది ఇవాళ నినాదనంగా మారిందన్నారు.



Updated : 1 Jun 2023 10:39 AM GMT
Tags:    
Next Story
Share it
Top