TS Assembly Elections 2023 : కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, మతకల్లోలాలు.. మంత్రి కేటీఆర్
X
కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, మతకల్లోలాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ నగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ బూత్ కమిటీల సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కడగండ్లు అని విమర్శించారు. ఆ పార్టీకి ఓటేసి తప్పు చేశామని కర్ణాటక రైతులు బాధపడుతున్నారని చెప్పారు. కన్నడ రైతులు మన రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్ పాపాలను చెబుతున్నారని వెల్లడించారు. కరెంటు ఇవ్వనందుకు నిరసనగా రైతులు మొసళ్లు తెచ్చి సబ్‌స్టేషన్లలో వదులుతున్నారని తెలిపారు.
కాంగ్రెస్‌లో ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు KTR. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అభ్యర్ధేనని విమర్శించారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నామని అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ చెప్పారని, మన రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంటు ఉస్తున్నామని వెల్లడించారు. డీకే మాటలు విని మన రైతులు ముక్కున వేలేసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కర్ణాటకలో రియల్ ఎస్టేట్ రంగం ఆగమాగం అయిందన్నారు. బెంగళూరులో చదరపు అడుగుకు రూ.500 ఎక్కువ వసూలు చేస్తున్నారని విమర్శించారు. అదే తెలంగాణలో టీఎస్ బీపాస్‌తో లంచాలు లేకుండా భవన నిర్మాణ అనుమతులు వస్తున్నాయని చెప్పారు.
ఎల్బీనగర్ 2014కు ముందు ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందని కార్యకర్తలను అడిగారు. ఎల్బీనగర్ ఎంత అభివృద్ధి చెందిందో ఇంటింటికి తిరిగి ప్రజలకు గుర్తుచేయాలని సూచించారు. గతంలో ట్రాఫిక్ అవస్థలు, మంచినీటి సమస్యలు, మురుగునీటి వాసన ఉండేవని, ఇప్పుడు అలాంటివేవీ ఇక్కడ లేవన్నారు. బూత్‌స్థాయి కార్యకర్తలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి చెప్పాలని సూచించారు. ఎల్బీనగర్ ఎంత అభివృద్ధి చెందిందో గుర్తుచేయాలన్నారు. సీఎం కేసీఆర్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలన్నారు. అన్నపూర్ణ పథకం ద్వారా రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తామని, కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా అన్నారు. రూ.400లకే వంటగ్యాస్ సిలిండర్ వంటి పథకాలను గురించి వివరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.