KTR : డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం కారుకే వేయండి.. మంత్రి కేటీఆర్
X
ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ , బీజేపీలపై విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. బుధవారం కామారెడ్డిలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. పిప్పర్ మెంట్లు, చాక్లెట్లకు ఆశపడొద్దని ఓటర్లకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను గెలిపించుకుంటే ధమ్ బిర్యానీ తినొచ్చని వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్లేనని కేటీఆర్ అన్నారు. కామారెడ్డి అభివృద్ధి కోసమే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు.
కామారెడ్డి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... కామారెడ్డిలో పోటీకి ఎవరొచ్చినా గంప కింద కమ్ముడే అని అన్నారు. తెలంగాణ బిడ్డలపై రేవంత్ రెడ్డి రైఫిల్ పెట్టిండన్నారు. కేసీఆర్ కామారెడ్డికి ఎందుకు వెళ్తున్నారన్న చర్చ నడుస్తోందన్నారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తేనే గ్రామగ్రామాన అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. ఎంతో కష్టపడి తెలంగాణను సాధించామని.. ఈ ప్రాంతానికి చెందిన పలువురు బలిదానాలు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. కామారెడ్డిలో ఈ నెల 9న కేసీఆర్ నామినేషన్ వేస్తారన్నారు. కేసీఆర్ నామినేషన్‌కి ఇంటికొకరు తరలిరావాలన్నారు. కేసీఆర్ వస్తున్నారంటే కామారెడ్డి దశ తిరిగిపోతుంది. బీజేపీ ఇచ్చే చాక్లెట్లు కావాలా? కేసీఆర్ ఇచ్చే ధమ్ బిర్యానీ కావాలా? అన్నారు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం కారుకే వేయండన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని, రీడర్ అన్నారు. విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఆంధ్రా-తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేశారన్నారు. ఆ తప్పు నుంచి బయటపడేందుకు 58 ఏళ్లు సమయం పట్టిందన్నారు. దేశంలో ఎమర్జెన్సీ పెట్టిందే నియంత ఇందిరాగాంధీ అన్నారు. ఢిల్లీ దొరలతో పోరాటం తెలంగాణకు కొత్త కాదన్నారు.
అంతకుముందు కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తుండగా.. మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఆపి చెక్ చేశారు ఎన్నికల అధికారులు. వారికి మంత్రి కేటీఆర్ పూర్తిగా సహకరించారు. కారులో ఏమీ లభ్యం కాలేదని.. వాటర్ బాటిల్స్ వంటివి తప్ప ఏం లేవని పోలీసులు వెల్లడించారు. తనిఖీల అనంతరం మంత్రి కేటీఆర్ కామారెడ్డి బయలుదేరి అక్కడి బహిరంగం సభలో ప్రసంగించారు. కాగా.. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ తమ అభ్యర్థుల తరపున బహిరంగ సభల్లో ప్రచారం చేస్తుండగా.. తన తండ్రి పోటీ చేస్తున్నా కామారెడ్డిలో కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు.