Ponguleti: గత ప్రభుత్వంలో చేసిన తప్పును మళ్లీ చేయొద్దు.. అధికారులకు మంత్రి పొంగులేటి
X
గత ప్రభుత్వంలో అధికారులు చేసిన తప్పిదాలు తిరిగి పునరావృతం కావద్దన్నారు రాష్ట్ర రెవెన్యూ, గృహా, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అధికారులపై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష్యసాధింపు లేదని చెప్పారు. సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి... పాలేరు నియోజకవర్గ సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని చెప్పారు.ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి గడపకు చేరాలని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలను మభ్యపెట్టి పాలన చేయమని అన్నారు. డిసెంబర్ 22 న మరో రెండు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని.. మరో రెండు పథకాలు సంక్రాంతి వరకు అమలు చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తామని అన్నారు.
జర్నలిస్టులకు కూడా త్వరలో తీపి కబురు అందిస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి. జర్నలిస్టులతో పాటు ఇళ్లు లేని ప్రతి పేద వారికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వమని.. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతకవచ్చని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నమన్న ఆహంకారంతో ఉన్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ధరణి పేరుతో ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న వాటిని తీసుకొని పేదలకు పంచుతామని చెప్పారు. ధరణిలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా ప్రక్షాళన చేస్తామన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.