TS RTC NEW BUSES : 1000 ఎలక్ట్రిక్ బస్సుల్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం - పొన్నం ప్రభాకర్
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. కార్మికులు, ప్రయాణికులు, సంస్థ పరిరక్షణమే తమ ప్రధాన బాధ్యత అని అన్నారు. గత ప్రభుత్వ తప్పులను సరిచేయడంతో పాటు బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని స్పష్టం చేశారు. శనివారం నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి పాల్గొన్న పొన్నం.. 80 కొత్త ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కొత్త బస్సులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్న ఆయన.. త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని.. వారి కృషి వల్లే సంస్థ ఎదుగుతోందని పొన్నం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ప్రారంభించామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేశారని దీన్ని బట్టి ఈ స్కీంకు ఎంత మంచి స్పందన ఉందో అర్థం అవుతుందన్నారు. 40 - 50 ఉండే ఆక్యుపెన్సీ రేటు ఇప్పుడు 100 దాటి పోవడం సంతోషంగా ఉందని పొన్నం చెప్పారు.
రూ.400 కోట్ల వ్యయంతో అధునాతన బస్సులను అందుబాటులోకి తెవడంతో పాటు 364 బస్టాండ్లలో వసతులు మెరుగుపరచనున్నట్లు పొన్నం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి మరువలేనిదని.. ఉద్యమకారుడిగా, ఎంపీగా తనకు తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనకు కార్మికులు కష్టపడ్డారని.. ఆర్టీసీ కృషి మరవలేనిదని అన్నారు.TS