KTR : హనుమంతుని గుడిలేని ఊరు లేదు.. కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదు : కేటీఆర్
X
హనుమంతుని గుడిలేని ఊరు లేదు.. కేసీఆర్ పథకం అందని ఇల్లు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్లలో బీఆర్ఎస్ అభ్యర్ధి కొప్పుల మహేశ్వర్ రెడ్డికి మద్ధతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. వచ్చే ఏడాదిలో కుల్కచర్లకు కృష్ణా నీళ్లు తీసుకొస్తామన్నారు. 55ఏళ్లు పాలించిన కాంగ్రెస్... తెలంగాణ అభివృద్ధి చేసిందేమి లేదని విమర్శించారు.
కాంగ్రెస్ కావాలా.. కరెంట్ కావాలో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ సూచించారు. గతంలో కరెంట్ ఎలా ఉందో.. ఇప్పడు ఎలా ఉందో గమనించాలని కోరారు. 75లక్షల మంది రైతులకు 73వేల కోట్ల రైతు బంధు ఇచ్చామని చెప్పారు. ఈ సారి అధికారంలోకి వచ్చాక ప్రజలందరికీ 5లక్షల బీమా కల్పిస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మీ పేరుతో ప్రతి మహిళకు 3వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందజేస్తామన్నారు. రైతు చనిపోతే వారం రోజుల్లోనే రూ. 5 లక్షల రైతుబీమా బాధిత కుటుంబానికి అందిస్తున్నామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఏమో గానీ.. ఆ పార్టీ అధికారంలోకొస్తే ఆరు నెలలకో సీఎం మారడం గ్యారెంటీ అని కేటీఆర్ సెటైర్ వేశారు. ఐదేళ్లలో 10మంది సీఎంలు మారడం పక్కా అంటూ విమర్శించారు. కేసీఆర్ మీద పోరాటానికి.. ఢిల్లీ, గుజరాత్ నేతలు వస్తున్నారని.. కానీ సింహం సింగిల్గా వస్తుందని చెప్పారు. మొన్న ఓటుకు నోటు.. నిన్న రేటుకు సీటు అంటూ రేవంత్ రెడ్డి కొత్త దందాకు తెరలేపాడని ఆరోపించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి మోసపోకుండా అభివృద్ధి చేసే బీఆర్ఎస్ను గెలిపించాలని కేటీఆర్ కోరారు.