బొర్ర ఉంటే ప్రమోషన్లు ఇయ్యకండి.. పోలీసులపై మల్లారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్
మాటలతో పాటు చేతలతో నిత్యం వార్తల్లో ఉండే మంత్రి మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా ఆయన పోలీసులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బొర్ర ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని.. హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లకు చెప్పారు. సిబ్బంది ఫిట్ నెస్ పెంచుకునేందుకు పోలీస్ స్టేషన్లలోనే జిమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. హోం మంత్రి, డీజీపీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ పోలీసులు బాగా పని చేస్తున్నారని, కేసులను తొందరగా పరిష్కరిస్తున్నారని ప్రశంసల జల్లు కురిపించారు. పోలీసులు తనలాగే మంచి ఫిట్ గా ఉండాలన్న మంత్రి పోలీసులను చూస్తే దొంగలు భయపడిపోయేలా స్మార్ట్ గా ఉండాలని అన్నారు. తెలంగాణ పోలీసులను మిలట్రీ స్థాయిలో తీర్చిదిద్దాలన్నారు. మల్లారెడ్డి మాటలకు హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ పగలబడి నవ్వారు.
తెలంగాణ మామూలు రాష్ట్రం కాదన్న మల్లారెడ్డి సీఎం కేసీఆర్ ఏం అనుకుంటే అది చేస్తారని చెప్పారు. ఒకప్పుడు ఐటీ పరిశ్రమ అంటే బెంగళూరు గుర్తొచ్చేదని ఇప్పుడు హైదరాబాద్ గురించి చెప్పుకుంటున్నారని అన్నారు. అమెరికా తర్వాత అమెజాన్, ఫేస్ బుక్, గూగుల్ తదితర బడా బడా ఐటీ కంపెనీలు ఒక్క హైదరాబాద్ లోనే ఉన్నాయని చెప్పారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.