BRS అభ్యర్థి నామినేషన్.. స్వయంగా కారు నడిపిన కవిత
X
నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా కారు నడిపారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్యే నివాసం నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు అంబాసిడర్ కారు నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. రెండవ సెట్ నామినేషన్ వేసేందుకు ఎమ్మెల్సీ కవితతో కలిసి ఎమ్మెల్యే గణేష్ గుప్తా ర్యాలీగా బయలు దేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గణేష్ గుప్తా చేసిన అభివృద్ధి, బీఆర్ఎస్ పథకాల వల్ల గెలుపు ఖాయమన్నారు. మూడవసారి ముఖ్యమంత్రి అయ్యే రికార్డ్ కేసీఆర్‌కి దక్కుతుందని కవిత జోస్యం చెప్పారు. ప్రజల ఆదరణ ప్రేమ వల్ల గెలుపు ఖాయమన్నారు. నిజామాబాద్ నగరం ఆనాడు ఎట్లా ఉండేది?.. ఈ రోజు ఎలా అయిందనే ఆలోచన చేయాలన్నారు. ఇక్కడ కల్పించిన శాంతి భద్రత వాతావరణం వల్ల అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి వచ్చాయన్నారు. 54 ఏళ్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ ఎనాడూ నిజామాబాద్‌కు చేసిందేమీ లేదన్నారు. ఆరుసార్లు బీజేపీకి అవకాశం ఇచ్చిన నిజామాబాద్‌కు చేసింది ఏమీ లేదని.. కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కవిత విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా నిన్న స్కూటీపై ప్రయాణించారు కవిత . గురువారం నిజామాబాద్ జిల్లా బోధన్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ బోధన్ ఆర్‌వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయటానికి ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలికి ఎమ్మెల్సీ కవిత రావాల్సి ఉంది. కానీ ఆమె కారులో వెళ్తుండగా దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కవిత ర్యాలీలో పాల్గొందుకు కారు దిగి స్కూటీపై ప్రయాణించారు. ఓ వ్యక్తి స్కూటీని నడుపుతుండగా కవిత వెనుకాల కూర్చొని ప్రయాణించారు. ఓ సామాన్యురాలిగా కవిత స్కూటీపై వెళ్తుండటం చూసిన స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆమెకు అభివాదం చేసేందుకు పోటీపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిన్న స్కూటీపై ప్రయాణించిన కవిత.. ఈ రోజు స్వయంగా ఆమే కారు డ్రైవ్ చేస్తు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.