MLC Kavitha : కేంద్రమంత్రి అమిత్ షాకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
X
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత దూసుకుపోతున్నారు. పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్ షోలు నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలోనే కోరుట్ల పట్టణంలోని నంది చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్ లో కవిత మాట్లాడారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షాకు ఆమె కౌంటర్ ఇచ్చారు.
కేంద్రమంత్రి ప్రకటనపై స్పందించిన కవిత ఆయన అమిత్ షా కాదు.. అబద్దాల షా అని అన్నారు. ఎయిరిండియా మూసివేత, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేసిన బీజేపీ వాళ్లు ఇప్పుడు ముత్యంపేట చక్కెర కర్మాగారం తెరిపిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అసలు ఆ షుగర్ ఫ్యాక్టరీని ముందించే బీజేపీ నేత గోకరాజు గంగరాజు అని చెప్పారు. ప్రభుత్వానికి చెప్పకుండా లేఔట్ చేసి కోర్టులో పంచాయితీ పెట్టాడని మండిపడ్డారు. షుగర్ ఫ్యాక్టరీ మూసివేతకు కారణమైన వారే ఇప్పుడు తెరిపిస్తామనడం ఏంటని కవిత ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందజేస్తోందని కవిత స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పింఛను రూ.1000కు పెంచారని, కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడడ్డా ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ అందించామని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం రైతులకు ఇస్తున్నట్లుగానే రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా పథకం వర్తింప జేస్తామని కవిత హామీ ఇచ్చారు. రూ.400లకే సిలిండర్తో పాటు రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తామని స్పష్టం చేశారు.