Movva Satyanarayana : అమిత్షా పర్యటన వేళ బీజేపీకి షాక్.. బీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత
X
తెలంగాణలో బీజేపీ జోరు పెంచడం కోసం అధిష్టానం నుంచి బడా నేతలంతా రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడంకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి షాక్ ల మీద షాక్ లు తగుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఆశావహులు పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా శేరిలింగంపల్లి బీజేపీ సీనియర్ నేత మొవ్వా సత్యనారాయణ బీజేపీకి రాజీనామాచేశారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీతో కలిసి కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ విజయానికి సమష్టిగా కృషి చేయాలని మొవ్వాను సూచించారు.
ఈ సందర్భంగా శేరిలింగంపల్లిలో ప్రచార కార్యకలాపాలు, నాయకులు, కార్యకర్తల పనితీరును మంత్రి కేటీరామారావు నేతలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన మొవ్వా.. బీజేపీ అధిష్టానం తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 18 లక్షల ఓటర్లున్న కమ్మ సామాజిక వర్గంలోని ఒక్కరికి కూడా బీజేపీ టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీతోనే కమ్మ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత, న్యాయం లభిస్తుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం శాయశక్తుల కృషి చేస్తానని, ఆరెకపూడి గాంధీని తప్పకుండా గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.